BRS Senior leaders : బీఆర్ఎస్ లో ఓ వెలుగువెలిగిన కొందరు సీనియర్లకు ఇప్పుడు టిక్కెట్ దక్కలేదు. ఇందులో తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జలగం వెంకట్రావుతోపాటు పలువురు నేతలు ఉన్నారు.
బీఆర్ఎస్‌లో తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్‌రెడ్డి ఓ వెలుగు వెలిగారు. కేసీఆర్ తొలి కేబినెట్‌లో మంత్రులుగా పనిచేశారు. కీలక శాఖలను చూశారు. 2014లో రోడ్లు, భవనాల శాఖను తుమ్మల చూస్తే..పట్నం మహేందర్‌రెడ్డి రవాణా శాఖను చూశారు. 2014 ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల, తాండూర్ నుంచి పట్నం గెలిచారు. ఐతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. దీంతో పట్నం సోదరులకు చెక్ పడినట్లు అయ్యింది. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రోహిత్‌కే సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు.
తుమ్మల విషయంలోనూ ఇదే జరిగింది. 2018 ఎన్నికల్లో పాలేరులో హస్తం అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్‌లోకి వచ్చారు. తాజాగా మరోసారి ఉపేందర్‌రెడ్డికే అవకాశం వరించింది. ఇటు మహేశ్వరం అసెంబ్లీ స్థానంలోనూ ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. కాంగ్రెస్ తరపున గెలిచిన సబితా ఇంద్రారెడ్డి..గులాబీ గూటికి చేరి మంత్రి అయ్యారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున సబితా బరిలో నిలవనున్నారు. తీగలకు టిక్కెట్ చేజారిపోయింది.
మరో సీనియర్ నేత జలగం వెంకట్రావుకు సైతం చుక్కెదురు అయ్యింది. కొత్తగూడెంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు..ఆ తర్వాత కారెక్కారు. ఈసారి కూడా ఆయననే అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఉప్పల్ నుంచి పోటీ చేయాలని భావించిన బొంతూ రామ్మోహన్‌కు సైతం భంగపడినట్లు కనిపిస్తోంది. ఇలా సీనియర్ నేతలకు సిట్టింగ్ ఎమ్మెల్యేల రూపంలో షాక్ తగిలింది. తమకే టికెట్ వస్తుందని..పార్టీ కోసం పనిచేశామని గట్టిగా నమ్మిన నేతలకు సీఎం కేసీఆర్ ఝలక్ ఇచ్చారు.