BRS MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీర్ఎస్ కార్యకర్తలు కవితకు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీతో జూబ్లిహిల్స్‌లోని కవిత నివాసానికి బయలుదేరారు. కవిత కోసం దాదాపు 1000 కార్లు శంషాబాద్ చేరుకున్నట్లు సమాచారం.
నిన్న ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోనే..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత నిన్న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో నిన్న ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉన్న కవిత.. బుధవారం మధ్యాహ్నం 2.45 గం.కు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి సాయంత్రం 5 గం.కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కవితతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజే ఆమె తన తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నందినగర్ లోని ఆయన నివాసంలో భేటీ కానున్నట్లు సమాచారం.
ఇక మంగళవారం రాత్రి ఎమ్మెల్యేలందరితో కవిత సమావేశం అయ్యారు. కష్టకాలంలో నిలిచినందుకు వారికి థ్యాంక్స్ చెప్పారు. ఎమ్మెల్యేలందరికి మిఠాయి తినిపించారు. కవిత రిలీజ్ తర్వాత జైలు బయట ఎమోషనల్ సీన్స్ చోటు చేసుకున్నాయి. బయటకు రాగానే బిగ్గరగా ఏడ్చేశారు కవిత. తన కొడుకు ఆదిత్యను పట్టుకుని కవిత భావోద్వేగానికి లోనయ్యారు. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌ను కౌగిలించుకుని కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా మార్చి 15న లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 5 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన కవిత ఎట్టకేలకు నిన్న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో విడుదలయ్యారు.