కేంద్ర ప్రభుత్వం.. మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ, తెలుగు ప్రజల గౌరవం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయనకు భారతరత్న ప్రకటించడం పట్ల ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో అనేకసార్లు పీవీకి భారతరత్న ప్రకటించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
Also Read: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించి భారతరత్న ప్రకటించాలని కోరిన విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు పీవీతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరితవిప్లవకారుడు స్వామినాథన్ కూడా కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది.
మరోవైపు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా స్పందించారు. తెలుగు ప్రజలకు ప్రత్యేకించి తెలంగాణకు దక్కిన గౌరవమిదని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డకు అత్యున్నత పురస్కారం లభించడం ఆ జిల్లావాసిగా గర్వపడుతున్నానని అన్నారు. దేశం కోసం ఎంతో సేవ చేసిన పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పీవీని కేవలం రాజకీయ లబ్దికే వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అంటూ ధ్వజమెత్తారు. రాజకీయాలకు అతీతంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారం అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం పీవీకి భారత రత్న ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగువారికి దక్కిన గౌరవం అని.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: దళిత మహిళపై దారుణం.. నడి బజార్లో నగ్నంగా కట్టేసి కొట్టిన గ్రామ పెద్దలు