Ex Minister Harish Rao: ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పిందని ఫైర్ అయ్యారు. ఎల్ ఆర్ ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్దమైందని అన్నారు.
నో ఎల్.ఆర్.ఎస్ - నో బీ.ఆర్.ఎస్ అంటూ గతం లో ప్రజలను రెచ్చగొట్టి ఇపుడు ఎల్.ఆర్.ఎస్ కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, గతం లో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్.ఆర్.ఎస్ ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలని హితవు పలికారు. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
LRS పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
2020 ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది.
నగర, పురపాలికలు, పంచాయతీ పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్లలోని ఫ్లాట్లను క్రమబద్ధీకరించేందుకు.. గత ప్రభుత్వం 2020లో దరఖాస్తులకు ఆహ్వానించింది. దీనికి 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కానీ కోర్టుల్లో పలువురు పిటీషన్లు వేయడంతో క్రమబద్దీకరణ చేపట్టే ప్రక్రియ ఆగిపోయింది. అయితే రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పెండింగులపై ఉన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి తమ సహకారం ఉంటుందని ఆయన గతంలోనే భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.