Brahmanandam : నవ్వడం(Laugh) ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు ప్రముఖ దర్శకుడు జంధ్యాల(Jandhyala). కానీ వీటన్నింటికన్నా అద్భుతమైనది మరొకటి ఉంది అదే నవ్వించగలగడం. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. చాలా కొద్ది మందికే ఇది సాధ్యమవుతుంది. తెలుగు సినిమా(Telugu Cinema) ల్లో చాలా పాత రోజుల నుంచీ కూడా హాస్య నటులకు కొదవేం లేదు. ఒక రేలంగా, పద్మనాభం, అల్లు రామలింగయ్యల్లాంటి వాళ్లు ఎందరో చిరకాలం గుర్తుండిపోయే హాస్యాన్ని మనకు అందించారు. కానీ తెలుగు వాడు ఎప్పటికీ గొప్పగా చెప్పుకునేది మాత్రం ఒక్కరి గురించే. సినిమాలు చేయడం మానేసినా... ఆయన ఉన్నా, లేకపోయినా కూడా తలుచుకుని నవ్వించగలిగే ఒకే ఒక వ్యక్తి బ్రహ్మానందం(Brahmanandam). ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
Also Read : Nallamala Forest : నల్లమల్ల అడవుల్లో రగిలిన కార్చిచ్చు
కామెడీ కింగ్...హీరో..
తెలుగు సినిమా హాస్య ప్రపంచంలో ధృవతారగా నిలిచిపోయే బ్రహ్మానందం... తన పేరులోనే బ్రహ్మాండమంతటి ఆనందాన్ని దాచుకున్నారు. దాన్నే మనందరికీ పంచి ఇచ్చారు. తాను నవ్వగలిగేవాడు అదృష్టవంతుడు... అందరినీ నవ్వించగలిగే వాడు గొప్పోడు. ఇంతటి ఘనత సాధించిన బ్రమ్మానందం దాదాపు 1250 సినిమాల్లో నటించారు. ఇదొక వరల్డ్ రికార్డ్(World Record). సినిమా ఏంటనేది సంబంధం లేకుండా తన కోసం అంటూ ఒక పాత్రను సృష్టించుకోగలిగే టాలెంట్ ఒక్క ఆయనకు మాత్రమే సాధ్యం. స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని క్రేజ్ తో కెరీర్‌ను దిగ్విజయంగా నడిపించుకున్నారు. మొదట్లో చిన్న సినిమాలు చేసిన బ్రహ్మానందానికి 1987లో జంధ్యాల తెరకెక్కించిన అహ నా పెళ్లంటలో అరగుండు పాత్ర టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన. ఈ 35 ఏళ్ళ కెరీర్‌లో అరడజన్ నందులతో పాటు.. ఓ ఫిల్మ్ ఫేర్(Film Fare).. మూడు సైమా అవార్డులు(SIIMA Awards) సొంతం చేసుకున్నాడు ఈ లెజెండరీ కమెడియన్.
ఉతపదాల సృష్టికర్త..
దర్శకులు చెప్పినా చెప్పకపోయినా సీన్ పండడానికి తనవంతుగా సొంతంగా కొన్ని ఊత పదాలు కూడా సృష్టించాడు ఈయన. అలా బ్రహ్మానందం నోట్లో నుంచి వచ్చిన జప్ఫా, నీ యంకమ్మా, పండగ చేస్కో డూ ఫెస్టివల్, ఖాన్‌తో గేమ్స్ ఆడకు శాల్తీలు లేచిపోతాయ్.. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లైతే.. ఇలా ఎన్నో మాటలు చిన్న పిల్లల నుంచి ముసలాళ్ల వరకు రోజూ వాడుకుంటారు. ఇక ఆయన సినీ ప్రస్థానంలో చేసినవన్నీ అద్భుత పాత్రలే అయినప్పటికీ.. అరగుండు, ఖాన్ దాదా, మైఖెల్ జాక్సన్, కిల్ బిల్ పాండే, చిత్రగుప్త, మెక్ డోల్డ్ మూర్తి, భట్టు, బద్ధం భాస్కర్, గచ్చిబౌలి దివాకర్, శాస్త్రి, చారి, హల్వా రాజ్, పద్మశ్రీ, ప్రణవ్, జయసూర్య, నెల్లూరు పెద్దారెడ్డి లాంటి పాత్రలు మాత్రం తరతరాలు నిలిచిపోతాయి.
మీమ్స్ కా బాప్..
ప్రస్తుతం బ్రహ్మానందం సినిమాలు చేయడం లేదు. దాదాపు 5,6 ఏళ్ళ నుంచీ ఆయన కనిపించడం లేదు. కానీ ఇంకా ఆయన నవ్వుల రారాజుగానే వెలుగొందుతున్నారు. బ్రహ్మీ అని ముద్దుగా పిలుచుకునే ఈ కమెడియన్ పనిగట్టుకుని హాస్యం పడించక్కర్లేదు. ఆయన మొహం, ఎక్సప్రెషన్స్ చాలు మనకు కడుపునొప్పి వచ్చేలా నవ్వించడానికి. సినిమాలు మానేసిన తర్వాత మీమ్స్ ద్వారా సూపర్ పాపులర్ అయ్యారు బ్రహ్మి. ఇది కూడా ఒక రికార్డే. ఇప్పటి వరకు ఏ కమెడియన్‌కూ దక్కని గౌరవం ఇది. ఏ ఎమోషన్ కు అయినా బ్రహ్మానందం స్టిల్ ఒకటి వాడుకుంటారు నెటిజన్లు. సోషల్ మీడియాలో బ్రహ్మి మీమ్స్ వాడని వారు ఉండరు. సోషల్‌మీడియాలో ఒక ఎమోజీలా మారిపోయారు బ్రహ్మానందం.ముందే చెప్పుకున్నట్టుగా బ్రహ్మి ఇక మీదట నటించకపోయినా కూడా పర్వేలదు. తెలుగు వారి మనసుల్లో, నవ్వుల్లో ఆయన ఎప్పుడూ తిష్ట వేసుకుని కూర్చునే ఉంటారు.
Also Read : Budget 2024 Live Updates🔴: మధ్యంతర బడ్జెట్.. కీ హైలెట్స్!