LK Advani: రాజకీయ కురువృద్ధుడు.. రాజనీతిజ్ఞడు ఎల్.కె. అద్వానీ

రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ. రాజకీయాల్లో ఒక ట్రెండ్ ను సెట్ చేసిన అద్వానీకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మొత్తం ఆర్టికల్ చదవండి.

New Update
LK Advani: రాజకీయ కురువృద్ధుడు.. రాజనీతిజ్ఞడు ఎల్.కె. అద్వానీ

LK Advani: 1980 దశకంలో బీజేపీ అంటే గుర్తొచ్చేది వాజ్‌పేయి.. అద్వానీలే. బీజేపీ ఈరోజు ఈస్థాయిలో ఉండడానికి కారణం ఈ కురువృద్ధులే. అద్వానీ నేడు రాజకీయంగా వయోభారం కారణంగా పార్టీకి దూరమయినప్పటికీ ఆయనకు దేశమంతా ఎందరో అభిమానులున్నారు. కరడు కట్టిన హిందు నేతగా పైకి కనిపించే అద్వానీ మనసు మాత్రం నిజానికి వెన్నపూస అని చెబుతారు..ఆయన గురించి తెలిసనవాళ్ళు ఎవరైనా. అందుకే అద్వానీని వాజ్‌పేయి తో సహా అందరూ గౌరవించేవారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివర వరకూ కట్టుబడిన అద్వానీకి నేడు దానికి తగ్గ గౌరవం లభించింది.

పుట్టిన తేదీ, చదువు..

1927 నవంబరు 8వ తేదీన సింథ్ ప్రాంతంలోని కరాచీలో ఎల్.కె. అద్వానీ (Lal Krishna Advani) జన్మించారు. మంచి సంపన్న కుటుంబం ఈయనది. తండ్రి వ్యాపారవేత్త. అద్వానీ విద్యాభ్యాసం అంతా ఇప్పటి పాకిస్థాన్ లోని కరాచీ, హైదరాబాద్‌లోనే జరిగింది. అయితే అద్వానీ తన ఇంజనీరింగ్ చదువుకు స్వస్తి చెప్పి పదిహేనేళ్ళ ప్రాయంలో ఆర్ఎస్ఎస్ లో చేరారు. 1947 సెప్టెంబర్ 12న భారత్ కు వచ్చారు.

జనసంఘ్ నుంచి...

ఇండియాకు వచ్చిన అద్వానీ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ (Bharatiya Jana Sangh) లో చేరారు. అద్వానీలోని చురుకుదనం, ఆయన మాట్లాడే తీరును గుర్తించిన శ్యామ్ ప్రసాద్ ఎప్పటికైనా మంచి లీడర్ అవుతారని అంచనా వేశారు. మొదట రాజస్థాన్ జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేసిన అద్వానీ 1966లో తొలిసారి ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ కు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికయ్యారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారు. ఆ తరువాత 1970 లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1977 లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖా మంత్రిగా పనిచేశారు. తరువాత 1986 నుంచి 1991 వరకు బీజేపీ పార్టీ బాధ్యతలను తలకెత్తుకున్నారు. పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించారు. 1998 లో వాజపేయి ప్రభుత్వంలో హోంమంత్రిగా వ్యవహరించారు. 2002 లో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. 2007 లో బీజేపీ ఆయనను ప్రధాని అభ్యర్ధిగా నిర్ణయించింది.

Also Read: తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

1990 రథయాత్ర..

అద్వానీ జీవితంలో ప్రముఖంగా నిలిచిపోయేది మాత్రం 1990లో జరిగిన రామ్ రథయాత్రనే (Rath yatra). అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం బీజేపీలో (BJP) చాలా మంది నాయకులు ఎన్నో చేవారు. అందులో చాలా త్యాగాలు కూడా ఉన్నాయి. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో ఎల్ కె అద్వానీ పాత్ర మరింత ప్రత్యేకం. అద్వానీ అంటే అయోధ్య… అయోధ్య అంటే అద్వానీ గా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పి), భజరంగదళ్ వంటి సంస్థల ప్రయత్నాలకు రాజకీయంగా మద్దతు ఇచ్చి దన్నుగా నిలబడింది అద్వానీనే. ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ప్పుడే అయోధ్య ఉద్యమానికి (Ayodhya Ram Mandir)  విస్తృత ప్రచారం కల్పించారు. రామాలయ నిర్మాణ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు రధయాత్ర కు శ్రీకారం చుట్టడం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. కేంద్రంలో నాటి వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే రామాలయ నిర్మాణానికి ఆయన పై వత్తిడి తీసుకు వచ్చారు. చర్చల ప్రక్రియ ఫలించకపోవడంతో రధయాత్ర ద్వారా ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్నారు ఎల్ కె అద్వానీ. దీంతో అప్పట్లో దేశ రాజకీయ గతే మారిపోయింది.

సోమనాథ్ నుంచి అయోధ్య వరకు..

1990 సెప్టెంబర్ 25న గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి అద్వానీ (LK Advani) రథయాత్రను ప్రారంభించారు. అక్టోబరు 30 నాటికి అయోధ్య చేరాలన్నది లక్ష్యం. మొత్తం 10వేల కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా ఎల్ కె అద్వానీ పెట్టుకున్నారు. దీనికి భారీ స్పందన కూడా వచ్చింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ లోనూ అద్వానీ రధయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. దీని ద్వారా రామాలయ అంశాన్ని, సాస్కృతిక జాతీయ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు . దాదాపు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించింది. ఆ టైమ్‌లో అ్దవానీని అరెస్ట్ చేయించారు లాలూప్రసాద్ యాదవ్. అక్టోబరు 24న రధయాత్ర యూపీలోని దేవరియాలో ప్రవేశించాల్సి ఉండగా అంతకు ముందు రోజు బీహార్ లోని సమస్తిపురలో ఎల్.కె. అద్వానీని అరెస్ట్ చేశారు.

ఇప్పుడు అయోధ్య నిర్మాణం, బాలరాముని ప్రతిష్ట జరగడానికి కారణం మాత్రం అద్వానీనే అని చెప్పకతప్పుదు. ఆయన పోరాటం ఫలితమే నేడు కనిపిస్తున్నది. అద్వానీ కనుక రథయాత్ర చేయకపోతే అయోధ్యలో రామమందిరం నిర్మాణం విషయం అంత సీరియస్ అయ్యేది కాదు. ఇది ఎవరైనా ఒప్పుకోవలసిన నిజం. ఇదే అద్వానీని హిందువల దృష్టిలో హీరోగా నిలబెట్టింది. 2008 లో ‘మై కంట్రీ.. మై లైఫ్’ పేరుతో తన బయోగ్రఫీని రాసారు. ఇంతకు ముందు పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. అద్వానీకి భారతరత్న పురస్కారం రావడం పట్ల అభినందలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు