Malla Reddy Illegal Layouts: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మల్లారెడ్డి ఆక్రమించిన స్థలంలో నిర్మాణాల కూల్చివేస్తున్నారు అధికారులు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని HMDA లేఅవుట్లో 2500 గజాల స్థలం మల్లారెడ్డి ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. కాలేజీ కోసం మల్లారెడ్డి (Malla Reddy) రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి మల్లారెడ్డి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఇప్పుడు ఆ ఆక్రమణలపై మేడ్చల్ కలెక్టర్ ఫోకస్ పెట్టారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం HMDA లేఅవుట్లో వేసిన రోడ్డును అధికారులు తొలిగిస్తున్నారు.
నాపై కుట్రలు చేస్తున్నారు.. మల్లారెడ్డి!
తన స్థానాల్లో నిర్మించిన నిర్మాణాలు అధికారులు కూల్చివేయడంపై స్పందించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. తనపై కొందరు నేతలు కావాలనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతుందని ఆరోపించారు. ప్రస్తుతం అధికారం, అధికారులు వల్ల చేతుల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా చేస్తారని అన్నారు. తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజ్‌కి రోడ్డు వేశామని తెలిపారు. 2500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని మున్సిపాలిటీకి గత ప్రభుత్వ హయాంలో ఇచ్చామని పేర్కొన్నారు. కాలేజ్ రోడ్డు తొలగించడంతో 25 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేస్తున్న ఈ పనితో ఇక పై తమ కాలేజ్ వద్ద ట్రాఫిక్ సమస్య భారీగా పెరిగిపోతుందని అన్నారు.
పార్టీ మారుతారా?
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో మంత్రి పదవి పోయిన మల్లారెడ్డి తన ఆస్తులను కాపాడుకునేందుకు పార్టీ మారుతారనే చర్చ గత కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. అయితే.. తాజాగా ఆయన బీజేపీ (BJP) లో చేరేందుకు ఆ పార్టీ పెద్దలతో రహస్య చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో జాయిన్ చేస్తానని.. దీనికి ప్రతీకారంగా తన కుమారుడికి మల్కాజ్ గిరి (Malkajgiri) ఎంపీ టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. మల్లారెడ్డి అడిగిన దానిపై బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: హైదరాబాద్‌లో విషాదం..ముగ్గురిని మింగేసిన మ్యాన్‌హోల్