నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు మరోసారి ఆందోళనలు చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని గత నాలుగు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సలర్‌ను తొలగించి.. రెగ్యూలర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు . జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి న్యాయం చేయాలని నినాదాలు చేస్తున్నారు. అప్పటిదాకా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత రెండేళ్ల క్రితం కూడా ఇలాగే విద్యార్థులు తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సుమారు 8 వేల మంది విద్యార్థులు గతంలో వారం రోజుల పాటు నిరసనలు చేశారు.
Also Read: అక్బరుద్దీన్ వార్నింగ్‌కు రేవంత్ భయపడ్డారా? రాజాసింగ్ సంచలనం!
చివరికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే దిగొచ్చింది. స్వయంగా పలుమార్లు మంత్రులు కూడా ఐఐటీని సందర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించారు. కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా అధికారులు విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే వారు మరోసారి పోరుబాట పట్టారు. బుధవారం రోజున సుమారు రెండు వేల మందికి పైగా విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. క్యాంపస్ ప్రధాన వీధుల గుండా ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేశారు. ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ భవనం ముందు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు నిరసనలు చేస్తామని తెలిపారు.
విద్యార్థుల డిమాండ్లు ఏంటంటే
1. యూనివర్సిటీలో అధికారులను మార్చాలి. స్థానికంగా ఉండే రెగ్యూలర్ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్‌ను నియమించాలి.
2. గత రెండేళ్లలో జరిగిన ఖర్చుల వివరాలను విద్యార్థులకు తెలియజేయాలి. జవాబుదారీతనంగా ఉండాలి.
3. భోజన నాణ్యతను పెంచాలి. మెనూ పాటించేలా చర్యలు తీసుకోవాలి. పారదర్శకంగా మెస్ కాంట్రాక్టులకు కేటాయించాలి.
4. పర్మినెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్‌ను నియమించాలి. క్యాంపస్ ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపరిచాలి. వైద్య నిపుణులను ఏర్పాటు చేయాలి. విద్యార్థినుల కోసం లేడి డాక్టర్లను కూడా నియమించాలి.
5. ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయాలి. ఆటర పరికరాలను అందించాలి. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాలి.
6. విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి, అలాగే ప్రతీనెల తమకు మోటివేషన్ క్లాస్‌లు నిర్వహించాలి.