నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క పోటీ చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు అండగా ఉంటానని...తెలంగాణలో ఉద్యోగాలు తీసుకరావడమే తన లక్ష్యమని బర్రెలక్క అలియాస్ శిరీష చెబుతున్నారు. ఈమెకు చాలా మంది నుంచి మద్దతు లభిస్తోంది. ఒక స్వతంత్ర, పేద అభ్యర్ధి ఇలా ధైర్యంగా పోటీ చేయడం సంచలనంగా మారింది. అదే ఆమెకు కష్టాలను కూడా కొనితెస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఇలాంటి వారు లేకపోవడంతో బర్రెలక్క మీద దాడులకు దిగుతున్నారు.
తాను ఓట్లు చీల్చుతాననే భయంతో కొందరు తన మీద దాడులకు ప్రయత్నిస్తున్నారని... తన తమ్ముడిపై దాడికి పాల్పడింది ఎవరో.. వారు ఏ పార్టీ వారో కూడా తెలుసునని అంటున్నారు బర్రెలక్క. పార్టీ పేరు చెప్పను కానీ ఈ పోరాటంలో వెనకడుగు వేయను అంటూ స్ట్రాంగ్ నిలబడుతున్నారు. నాలుగైదు సార్లు గెలిచిన వాళ్లు, అధికార పార్టీ వాళ్లు నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే రౌడీమూకలతో నాపై దాడులకు ప్రయత్నిస్తున్నారు. నాకు అండగా నిలబడుతున్న వారిని కూడా బెదిరిస్తున్నారు. కానీ తాను ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేసినా.. భవిష్యత్‌లో వెయ్యి అడుగులు వెనక్కి వేసినదాన్ని అవుతుంది.. యువతకు ఇది తప్పుడు సంకేతం ఇస్తుంది అంటున్నారు బర్రెలక్క. ఈ నేపథ్యంలో ఆమెకు అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం నాయకులు కావేట శ్రీనివాసరావు, కరణం రాజేశ్, ఆదిత్య దొడ్డల అండగా ఉంటామని ప్రకటించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, బర్రెలక్కకు రక్షణ కల్పించాలని ఎస్పీని కలసి కోరుతామన్నారు.
దీనికి తోడు తనకు 2 ప్లస్, 2 గన్ మెన్నలతో భద్రత కావాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాకలు చేశారు బర్రెలక్క. దీనికి సంబంధించి హోంశాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ విచారించనుంది.