Ukraine : ఉక్రెయిన్ తో రెండేళ్లకు పైగా సాగుతోన్న యుద్దంలో రష్యా (Russia) కు ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యం... అక్కడి ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. కస్క్ రీజియన్ లోని 1000 చదరపు కిలోమీటర్ల మేర రష్యా భూభాగం తమ అధీనంలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్‌స్కో తెలిపారు.
మరో వైపు రష్యాలోకి తమ సేనలు అడుగుపెట్టినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelenskyy) కూడా మొదటిసారి మీడియాతో తెలిపారు. ఈ క్రమంలో తమ సైనిక సిబ్బందిని ఆయన అభినందించారు. ఆ ప్రాంతంలో మానవతా సహాయం అందిస్తామని జెలెన్ స్కీ వివరించారు.
కీవ్ బలగాల చొరబాటును ఉక్రెయిన్ లోని డాన్‌బాస్ లో మాస్కోను నిలువరించేందుకు చేసిన ప్రయత్నంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలతో సాగుతున్న భీకర పోరులో మాస్కో విజయం సాధిస్తుందని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు.
దేశ ఉన్నతస్థాయి రక్షణ, భద్రతాధికారులతో సమావేశమైన పుతిన్.. ఆగస్టు 6న ఉక్రెయిన్ దాడులు మొదలైనట్లు తెలిపారు. ఇరు సైన్యాల పరస్పర దాడులతో కస్క్ రీజియన్ లో ఇప్పటికే లక్ష మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
Also Read: ఆ బాధ్యత వాళ్లదే…నిందించడం సరికాదు: పీటీ ఉష!