ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆశా వర్కర్లు రోడ్డుపై బైటాయించి తమకు గౌరవ వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. నీరసన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. ఆశా వర్కర్లకు 18,000 రూపాయల గౌరవ వేతనం అందిస్తానని సీఎం కేసీఆర్ గతంలోనే హామి ఇచ్చారని వారు గుర్తు చేశారు. కేసీఆర్ మాత్రం తమకు ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు.
తాము ఎండా, వానలను లెక్క చేయకుండా గ్రామంలో తిరుగుతూ రోగులను ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లి మళ్లీ క్షేమంగా వారిని ఇంటి వద్ద దించుతున్నామన్నారు. కొన్ని సార్లు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినా తమ సొంత డబ్బులతో రోగులను, గర్భిణులను ఆస్పత్రులను తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. అంతే కాకుండా చిన్న పిల్లలకు అందించే పోషక ఆహారం కోసం తమ సొంత నిధులతో సమీప పట్టణ ప్రాంతాలకు వెళ్లి వాటిని తీసుకువచ్చి పిల్లలకు అందించామన్నారు. ప్రభుత్వం సహకరించకపోయినా తాము గ్రామాల్లో ఉన్న గర్భిణులకు, చిన్నారులకు పోషకాహారాలను అందించామన్నారు.
ప్రభుత్వం మాత్రం తమ శ్రమను గుర్తించడం లేదని ఆశా వర్కర్లు మండిపడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు సేవ చేస్తున్న తమకు ప్రభుత్వం గౌరవ వేతనం అందించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోకుంటే తమ ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికే ఇబ్బందని, ప్రభుత్వం త్వరిత గతిన తమ సమస్యలను పరిష్కరించాలన్నారు.