`అన్న జగనన్న ఎక్కుపెట్టిన బాణాన్ని' అంటూ పుష్కరకాలం క్రితం రాజకీయ క్షేత్రంలో ప్రవేశించి, ఎన్నో మలుపులు తిరుగుతూ తాజాగా ఎపిసిసి అధ్యక్షురాలిగా ఏపీ లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల దారి ఎటు? ఇదే ప్రశ్న రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నది.
పిసిసి పదవి చేబడుతూ ఆమె చేసిన తొలి ప్రసంగంలో ముఖ్యమంత్రిగా ఉన్న అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై పదునైన విమర్శలు చేయడంతో `జగనన్న వదిలిన బాణం'ను ఇప్పుడు `జగనన్న మీదనే' ఎక్కుపెడుతున్నారా? అనిపించింది. తన రాజకీయ ఉనికి కాపాడుకొనే ఆత్రుత తప్ప స్పష్టమైన రాజకీయ వ్యూహం ఆమెలో కనిపించడం లేదు. ఆమెను మరెవ్వరో వెనుకుంది నడిపిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
అప్పుడు జైలుకు వెళ్లిన అన్నకు బాసటగా, ఆయన అప్పుడప్పుడే ప్రారంభించిన కొత్త పార్టీ ప్రాణం కాపాడేందుకు పుష్కరకాలం క్రితం ఆమె తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. అయితే, ఆ తర్వాత రాజకీయంగానే కాకుండా, ఆస్తుల విషయంలో కూడా అన్నతో సరిపడక కొంతకాలం మౌనంగా యూనిపోయారు. ఆ తర్వాత తెలంగాణాలో `రాజన్న రాజ్యం' తెస్తానంటూ `తెలంగాణ బిడ్డ'ను అంటూ వైఎస్సాఆర్ టిపిని ప్రారంభించారు.
రెండేళ్ల పాటు సుమారు 3,000 కిమీ దూరం పాదయాత్ర జరిపినా తెలంగాణాలో మీడియాలో తప్పా జనంలో పట్టు సంపాదించలేక పోయారు. బహుశా దేశం మొత్తం మీద ఓ మహిళా రాజకీయ నాయకురాలు అంత సుదీర్ఘ దూరం పాదయాత్ర జరిపిన సందర్భం లేదని చెప్పవచ్చు. అయినా ఆమె పార్టీకి 1 శాతం మించి ఓట్లు లేవని, ఆమె పోటీ చేయాలనుకున్న పాలేరులో సహితం 3 శాతం మించి ఓట్లు రావని ప్యూపిల్స్ పల్స్ అనే సంస్థ జరిపిన సర్వే వెల్లడించింది.
దానితో కాంగ్రెస్ తో బేరం ఆడి, తన పార్టీని విలీనం చేసేందుకు సిద్దమై రాజకీయ బేరానికి దిగితే `తెలంగాణ సెంటిమెంట్' పేరుతో రేవంత్ రెడ్డి వంటి నేతలు అడ్డుపడటంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. దానితో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పేరు ప్రస్తావించక పోయినా రేవంత్ వంటి వారిని ముఖ్యమంత్రిగా చేయవద్దంటూ కాంగ్రెస్ అధిష్టానంను హెచ్చరించారు కూడా.
అన్న జైలులో ఉన్నప్పుడు చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో కడప ఎంపీ సీటు కోరారు. అది కుదరదంటే ఒంగోలు లేదా విశాఖపట్టణం సీట్లలో ఒకటి అడిగారు. కానీ పార్టీలో `రెండు అధికార కేంద్రాలు' ఉండటం మంచిదికాదని వైఎస్ జగన్ ముందుగానే అప్రమత్తమై ఒంగోలు లో బాబాయి సుబ్బారెడ్డిని, విశాఖలో అమ్మ విజయలక్ష్మి, కడపలో సోదరుడు అవినాష్ రెడ్డిని నిలబెట్టారు.
ఆ తర్వాత కనీసం అన్న ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అయినా రాజ్యసభ సీటు వస్తుందని ఎదురు చూసి ఫలించక పోవడంతో రాజకీయంగా తన దారి చూసుకోవడం షర్మిల ప్రారంభించారు. చివరకు `రాజన్న' కుమార్తెగా అన్న జగన్ మాదిరిగా సొంతంగా రాజకీయ ఉనికి కాపాడుకోలేనని గ్రహించి కాంగ్రెస్ తప్ప గత్యంతరం లేదనే నిర్ణయానికి ఆమె వచ్చిన్నట్లు కనిపిస్తున్నది.
తెలంగాణ బిడ్డను, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగానని, రాజకీయాలు కూడా ఇక్కడే అని భీష్మించుకుని కూర్చున్న ఆమె కాంగ్రెస్ పెద్దల వత్తిడులకు తలవంచి ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ప్రవేశించాల్సి వచ్చింది. వచ్చి రావడంతోనే అన్న పాలనపై విమర్శలు గుప్పించడం, పేరుపెట్టి అన్నాపై ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
ఇప్పటివరకు ఒక విధంగా ఆమె పట్ల సంయమనంతో ఉంటూ వచ్చిన వైసిపి శ్రేణులు ఆమె అన్నపై విరుచుకు పడటాన్ని సహింపలేక పోతున్నారు. దానితో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కూడా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని, అభివృద్ధి లేదని ఆమె విమర్శలు గుప్పించిన ఆమె అసలు లక్ష్యం అన్న జగన్ అని ఆమె మాటల ధోరణి స్పష్టం చేస్తుంది.
తన ప్రసంగంలో రెండు మూడు సార్లు జగన్ రెడ్డి అంటూ సోదరుడిని నిలదీశారు.
మున్ముందు తన రాజకీయ లక్ష్యం జగన్ మోహన్ రెడ్డేనని తొలి ప్రసంగంలోనే ఆమె స్పష్టతనిచ్చారు. దానితో వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఖాతాల నుంచి తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. వైఎస్.షర్మిల పేరును రకరకాలుగా మారుస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. షర్మిలను రకరకాలుగా దూషిస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు.
తాజాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె ఇంటి పేరుపై పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. `వైఎస్'కు అసలైన వారసత్వం వైసిపి పార్టీదే అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేయడం గమనార్హం. ఆమె తన ఇంటిపేరును `వైఎస్'గా పేర్కొంటూ ఉండటం పట్ల ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిల పేరుపై రాని అభ్యంతరాలు ఒక్కరోజులోనే మారిపోవడం అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. షర్మిల ఇకపై భర్త ఇంటి పేరును వాడుకోవాలని, వైఎస్ కుటుంబంతో ఆమెకు సంబంధం లేదంటూ రకరకాల వ్యాఖ్యానాలు, కామెంట్లు వెలువడ్డాయి.
వైసీపీలో ఉన్న ద్వితియ శ్రేణి నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు ఆమెను దూషించడానికి పోటీలు పడుతున్నారు. రాబోవు రోజులలో ఆమెపై వ్యక్తిగత విమర్శలు శృతిమించే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ కుటుంబంలోని కలహాలను అడ్డం పెట్టుకొని షర్మిలను ప్రయోగించి తమ రాజకీయ మనుగడకు ఆసరాగా చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఎత్తుగడ వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చి ఏపీలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నోటాతో పాటుగా కూడా ఓట్లు లేని కాంగ్రెస్ పార్టీకి ఆమె జీవం పోస్తారు అనుకుంటే అపహాస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఆమె జగన్ తో పాటు ఏపీలో చెప్పుకోదగిన ప్రాబల్యం కూడా లేని బిజెపిపై కూడా విరుచుకు పడుతూ ఉండటం గమనిస్తే ఆమెను అడ్డు పెట్టుకొని జగన్ ను కాంగ్రెస్ కూటమి వైపు తిప్పుకోవడమే అసలు లక్ష్యంగా కనిపిస్తుంది.
అయితే, ఆమెను కావాలని వైసిపి శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా ఈ సందర్భంగా కలుగుతున్నాయి. ఆమె ఎపిసిసి అధ్యక్షురాలిగా మొదటి ప్రసంగంలో ఏపీ ప్రజలకు ఎటువంటి రాజకీయ సందేశం ఇవ్వలేక పోయారు. రాజకీయంగా తనను ఏకాకి చేశారనే ఆక్రోశమే ఆమె మాటలలో కనిపిస్తుంది.
ప్రస్తుత ఏపీ రాజకీయాలలో అద్భుతాలు సృష్టించగల శక్తీ సామర్ధ్యాలు ఆమెకు లేవని తెలంగాణాలో ఆమె ఎంతగా కష్టపడ్డా ఫలితం లేకపోవడం వెల్లడి చేస్తుంది. అయితే, అన్న జగన్ ను లక్ష్యంగా చేసుకొని ఆమె ఎంతగా విమర్శలు గుప్పిస్తే అంతగా అధికార పక్షానికి రాజకీయంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
వైసిపిలో సీట్లు రాని, సీఎం జగన్ వద్ద పలుకుబడి కోల్పోయినవారు టిడిపి - జనసేన కూటమి వైపు దృష్టి సారించకుండా షర్మిల దగ్గరకు వెడితే `ప్రభుత్వ వ్యతిరేక' ఓట్లలో 1 లేదా 2 శాతమైనా చీలిక తెచ్చినట్లు అయ్యే అవకాశం ఉంది.
ఆ విధంగా అటువంటి ఓట్లు ఏ మేరకైనా టిడిపి- జనసేన కూటమి వైపు మారకుండా ఆమె అడ్డుకో గలిగితే పరోక్షంగా వైసీపీకి రాజకీయంగా లబ్ది చేకూరినట్లు అవుతుంది. ఆ విధంగా ఆమె ఏపీ రాజకీయాలలో ప్రవేశించడం ఒక విధంగా అధికార పక్షానికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
అయితే, ఎన్నికలకు రెండు నెలలు మాత్రమే గడువు ఉండడంతో కొత్త తరం నేతలు ఎవ్వరిని ఆమె ఆకట్టుకొనే అవకాశం లేదు. రాజకీయంగా తెరమరుగైన, ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపలేకపోతున్న డా. కెవిపి రామచంద్రరావు, ఎన్ రఘువీరారెడ్డి, శైలజానాథ్ వంటి `పాతతరం' నాయకుల కనుసన్నలలో ఆమె వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
పార్టీలో కొత్త నాయకులు ఎవ్వరూ రాకుండా గత పదేళ్లుగా అడ్డుకుంటూ వస్తున్న నేతలతో ఆమె కాంగ్రెస్ కు పునర్జీవనం కలిగించగలరని ఎవ్వరూ భావించడం లేదు. పైగా, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వంలో, పార్టీలో అంతులేని ప్రయోజనాలు పొందిన ఇటువంటి నాయకులు ఇప్పుడు వైఎస్ జగన్ దగ్గరకు చేరనీయలేకపోవడంతో రాజకీయంగా దాదాపు తెరమరుగై ఉన్నారు. పరోక్షంగా జగన్ పై తమ అక్కసు తీర్చుకొనే ప్రయత్నాలకు షర్మిలను పావుగా వాడుకొంటున్నారా?
ఇక, ఆమె మణిపూర్ హింస వంటి అంశాలను ఏపీలో లేవనెత్తడం ద్వారా బీజేపేని లక్ష్యంగా చేసుకోవడం గమనిస్తే అన్నకు `రక్షణ కవచం'గా ఉంటూ వస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
హైదరాబాద్ లో తెలంగాణ పోలీసులు ఆమెను క్రేన్ మీద ఎత్తుకు పోతుంటే ఇప్పుడు రాజకీయ ఆశ్రమం ఇచ్చిన నీ రాహుల్ బాబా గాని, ఇతర నేతలు గాని ఎవరూ అండగా ఉండే ప్రయత్నం చేయలేదు. ప్రధాని మోదీ స్వయంగా ఆమెకు ఫోన్ చేసి సానుభూతి తెలిపారు. పలువురు బిజెపి నేతలు ఆమెకు సంఘీభావం వ్యక్తం చేశారు. ఏపీలో రాజకీయంగా ఉనికి లేని బిజెపిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించడం వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఏవి? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
-చలసాని నరేంద్ర