Ap DGP: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయాన్ని డీజీపీ ద్వారకా తిరుమల రావు సీఎం ఆదేశాల మేరకు పరిశీలించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంఘటన యాక్సిడెంట్ కాదని.. ఇన్సిడెంట్‌లా కనిపిస్తోందన్నారు.‘గత రాత్రి 11.30 గంటలకు మదనపల్లె ఆర్డీవో ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. సుమారుగా 3 గంటలపాటు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాం. ఇది యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్‌గా అనుకుంటున్నాం. 22ఏ భూముల రికార్డులున్న గదిలో మంటలు చెలరేగాయి.
కీలక సెక్షన్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. అయితే, ఘటనకు సంబంధించిన సమాచారం ఆర్డీవోకు తెలిసింది.. కానీ, ఆయన కలెక్టర్‌కు తెలియజేయలేదు. స్థానిక సీఐకి తెలిసినా ఆయన కూడా డీఎస్పీ, ఎస్పీలకు సమాచారం అందించలేదు. ఈ పరిణామాలు అన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశమే లేదు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు కూడా స్పష్టం చేస్తున్నారు.
ఆర్డీవో ఆఫీసులో కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. ఆఫీసు బయట కూడా పలు ఫైల్స్ కాలిపోయినట్లు గుర్తించాం. ఇవన్నీ కూడా అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఇటీవల సాక్ష్యాలను నాశనం చేసే ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా దర్యాప్తు మొదలుపెట్టాం. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశాం’ అంటూ ఆయన మీడియాకి వివరించారు.
Also read: తెలివి తక్కువ దద్దమ్మ అన్నందుకు..పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు!