ఏపీ మాజీ సీఎం జగన్‌కు, ఏసీసీసీ చీఫ్ షర్మిలకు మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆస్తిలో షర్మిలకు ఏమీ ఇచ్చేది లేదని అనుకున్న జగన్.. ఇప్పుడు ఆస్తి పంపకాలకు ముందుకు వచ్చినట్లు ప్రచారాలు జరిగాయి. బెంగళూరులోనే వీటికి సంబంధించిన చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఒంటరిగా ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న జగన్.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను కలుపుకొని పోయే యోచనలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. జగన్, షర్మిల రాజీకి వచ్చేశారని అనుకున్న తరుణంలో వస్తున్న ఈ అంచనాలకు భిన్నంగా మరో ఊహించని పరిణామం బయటపడింది.
వాటా కేటాయింపులో వివాదం
వైసీపీ కుటుంబంలో ఆస్తి వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో వాటాల కేటాయింపుపై వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై జగన్, తన సతిమణి భారతితో కలిసి.. సెప్టెంబర్ 9న షర్మిల, విజయమ్మపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో పిటిషన్ వేశారు. ఆస్తి పంపకాల విషయంలో సొంత తల్లి, చెల్లిపై కోర్టులో ఫిర్యాదు చేసిన వ్యవహారం తాజాగా వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. సరస్వతి పవర్ షేర్ల వివాదంపై క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, జగన్, భారతి రెడ్డి పేర్లతో ఐదు పిటిషన్లు వేశారు.
Also Read: పంట వ్యర్థాలు తగలబెట్టడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
మొదట్లో తన సోదరి షర్మిలకు వాటాలు కేటాయించాలని అనుకున్నానని.. కానీ కొన్నేళ్లుగా ఆమె తనకు వ్యతిరేకంగా రాజకీయం చేయడం వాటాలను తిరిగి తీసుకుంటున్నట్లు జగన్ పిటిషన్‌లో తెలిపారు. 2019, ఆగస్టు 21న MOU ప్రకారం విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించామని.. కానీ వివిధ కారణాల వల్ల కేటాయింపు జరగలేదని తెలిపారు. అందుకే ఇప్పుడు ఆ షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే NCLT ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది, తదుపరి విచారణను నవంబర్ 8కు వాయిదా వేసింది.
సిగ్గుచేటు
ఇదిలాఉండగా ఇటీవల షర్మిల కూడా జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్న మానసపుత్రిక అయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని జగన్ ఎలా నిర్వీర్యం చేశారో గుర్తు చేశారు. నాడు ఈ పథకాన్ని వైఎస్సార్ అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకు జగన ఈ పథకాన్ని నీరుగార్చారంటూ విమర్శించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లను పెండింగ్‌లో పెట్టడం నిజంగా సిగ్గు చేటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకుండా వాళ్ల జీవితాలతో చెలగాటాలు ఆడారాని.. తల్లిదండ్రలను మనోవేదనకు గురిచేశారంటూ విమర్శించారు.
Also Read: రేపు TDP, YCP బయటపెట్టబోయేది ఇదే!
బీజేపీతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన జగన్.. మోదీ వారసుడని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాళ్లకు వైఎస్సాఆర్ ఆశయాలు గుర్తుంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులు అవుతారని అనుకోవడం పొరపాటని అన్నారు. ప్రస్తుత రాజీకీయ పరిణామాల వల్ల జగన్, షర్మిల మధ్య ఆస్తి పంపకాల్లో రాజీ కుదిరిందని.. త్వరలోనే వీళ్లు కలిసే అవకాశం ఉందనే ప్రచారాలు జరిగిన నేపథ్యంలో ఆస్తి తగాదాలు మరింత ముదరడం ప్రాధాన్యం సంతరించుకుంది.