/rtv/media/media_files/2026/01/12/fotojet-2026-01-12t133910-2026-01-12-13-40-15.jpg)
Bhogi Mantalu (Bonfire)
Bhogi Mantalu : పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైంది. హైదరాబాద్‌లో స్ధిరపడిన వారంతా ఈ పండుక్కి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. సంక్రాంతి అనగానే మనకు గుర్తుకు వచ్చేది రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులే కాదు. దాని ముందు రోజు జరుపుకునే భోగిమంటలు కూడా. మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకునే ఈ పండుగలో తొలిరోజు భోగిపండుగ అంటారు. ఆరోజు భోగిమంటలు వేస్తారు. ఆ మంటల్లో పాత వస్తువులను వేస్తుంటారు. అయితే ఏయే వస్తువులు వేస్తారు? భోగి మంటల్లో ఆవు పిడకలను కచ్చితంగా వేయాలా? భోగిమంటల్లో కాచిన నీటితో స్నానం ఎందుకు చేయాలి? అనేది చాలామందికి తెలియదు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/12/fotojet-2026-01-12t133923-2026-01-12-13-41-28.jpg)
అయితే భోగిమంటలు అనేది కేవలం ఒక సంప్రదాయంగా మాత్రమే కాకా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆరోగ్య, పర్యావరణ పరంగా చెపుతారు. భోగిమంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలను వాడటం వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం ఉంది. ఆవును భారతీయ సంప్రదాయంలో పవిత్రమైన సాదుజంతువుగా భావిస్తారు. గోమాతగా పూజిస్తారు. ఆవు పేడతో చేసిన పిడకలను యజ్ఞయాగాల్లో ఉపయోగిస్తారు. భోగి మంటలను కూడా ఒక యజ్ఞంలాగా భావిస్తారు. అందువల్ల ఆ మంటల్లో ఆవు పేడతో తయారైన పిడకలను వేస్తారు. దీనికి కారణం ఏంటంటే? ఆవు పిడకలను కాల్చినపుడు హానికరమైన వాయువులు తక్కువగా విడుదలవుతాయి. ఆ పొగ వల్ల దోమలు, పురుగులు దూరంగా ఉంటాయి. అదే సమయంలో గాలి శుద్ధి అవుతుంది. పర్యావరణం రీత్యా.. ఆవు పేడ సహజంగా శుద్ధి పదార్థం. కాల్చిన తర్వాత వచ్చే బూడిదతో నేలకూడా సారవంతమవుతుంది. పంటలకు ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది.
అదే సమయంలో భోగి మంటల్లో పిడకలతోపాటు సంప్రదాయంలో పాత చెక్క సామాన్లు, పాతబట్టలు, పాడైన చాపలు, బుట్టలు, ఎండిన ఆకులు, కొబ్బరి పీచు తదితర వస్తువులు వేస్తారు. ఈ మంటల్లో ప్లాస్టిక్, రబ్బరు, ఇతర రసాయనాలతో తయారు చేసిన వస్తువులు, పెయింట్ వేసిన చెక్క వంటివాటిని వేయరాదు. వీటివల్ల పర్యావరణం కాలుష్యమవుతుంది. భోగిమంటలను శుద్ధిచేసే అగ్నిగా భావిస్తారు. అందుకే సహజసిద్ధమైన పదార్థాలనే వేయాలి. అంతేకానీ, పర్యావరణానికి ఇబ్బంది కలిగించే వస్తవులను వేయరాదు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/12/fotojet-2026-01-12t133940-2026-01-12-13-41-57.jpg)
పాత వస్తువుల్ని భోగిమంటల్లో వేయడం వెనుక కూడా చాలా కారణాలు ఉన్నాయి. పెద్దలు చెప్పిన ప్రకారం.. ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే తొలిపండుగ సంక్రాంతి. ఈ పండుగ నుంచి పాతదాన్ని వదిలి కొత్తదానిని స్వీకరించడం, గత సంవత్సర కష్టాలు, నెగిటివిటీని భోగిమంటల్లో సమర్పించి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలన్నది అందరి అభిప్రాయం. కొత్త సంవత్సరం, కొత్తపంట, కొత్త ఆశలకు సంకేతంగా భావిస్తారు. భోగిమంటలను అగ్నిదేవుడికి హవనం చేసినట్లు భావిస్తారు. అహంకారం, అలసత్వం, నిర్లక్ష్యం వంటి గుణాలను వదిలేయాలని సంకల్పిస్తారు. అందుకే పాత వస్తువులను మంటల్లో వేయడం ద్వారా పాతవాటికి స్వస్తిచెప్పి కొత్తవాటికి శ్రీకారం చుట్టడం అనేది ఇందులో ఇమిడి ఉంది.
పంటకోత తర్వాత మిగిలిన సహజ వ్యర్థాలను, క్రిములు, పురుగులను నశింపజేసే శక్తి భోగిమంటలకు ఉందని పెద్దలు నమ్ముతారు. చలికాలంలో సాధారణంగానే వేడినీటితో స్నానం చేస్తుంటాం. భోగి రోజున భోగిమంటలతో కాచిన నీటితో స్నానం చేయడం ఇంకా మంచిదని వారు భావిస్తారు. ఆవు పిడకలు, చెక్కలు కాల్చినప్పుడు విడుదలయ్యే సహజ వాయువులు, ఆ వేడిలో కాచిన నీటిలో సూక్ష్మ క్రిమినాశక గుణాలు ఉంటాయని అందరి నమ్మకం. అందుకే భోగిమంటల్లో కాచిన వేడినీళ్లతో స్నానం తప్పనిసరిగా చేస్తారు. అగ్నిస్పర్శ పొందిన నీటితో స్నానం చేస్తే.. శరీరంతో పాటు మనస్సు కూడా శుద్ధిగా మారుతుందని పెద్దలు చెబుతుంటారు.
Follow Us