vaikunta ekadasi: ఈ ద్వారం మోక్షానికి మార్గం..తిరుమలలో వైకుంఠ ద్వారం వెనుక రహస్యం ఇదే!

ప్రతీ ఏడాది వచ్చే వైకుంఠ ఏకాదశి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ముఖ్యంగా తిరుమలలో వైకుంఠ ద్వారం దగ్గర ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. పది రోజుల పాటూ ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటారు. దీని విశిష్టత ఏంటి...కింది ఆర్టికల్ లో..

New Update
tirumala employee

tirumala employee Photograph: (tirumala employee)

సూర్యడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. తెలుగు ప్రజలందరూ అత్యంత భక్తిగా జరుపుకునే పర్వదినం.  ఏడాదిలో 24 ఏకాదశులలో అత్యంత ప్రాధాన్యం ఈ ఒక్క ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశికే ఉంది.  ఈ సమయంలో తిరుమల శ్రీవారికి దర్శించుకోవడం..అది కూడా ఉత్తర ద్వారం గుండా..నేరుగా మోక్షానికే మార్గమని చెబుతారు. 

హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారాలు ఏర్పాటు చేస్తారు. శ్రీమహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి ఈరోజున గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తారని అత్యంత నమ్మకం. మామూలుగా మనం చేసే పండులన్నీ చాంద్రాయణం ప్రకారమే చేసుకుంటాం. కానీ ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని మాత్రం సూర్యమానం ప్రకారం చేస్తారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో పవిత్రతను సంతరించుకున్నందు వల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజునూ పాలకడలిలో అమృతం ఉద్భవించిందని చెబుతారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసింది కూడా ఈరోజునే. అలంాటి ఈ రోజున తిరుమలలో ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయని చెబుతారు. మోక్షం సిద్ధిస్తుందని ప్రతీతి. 

దీని వెనుక కథ..

తిరుమల ఉత్తర ద్వారం గురించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీమహావిష్ణువు పాల సముద్రంలో శేషతల్పంపై శయనిస్తున్నప్పుడు ఆయన చెవిలోని మలినాల నుంచి భారీ కాయులైనటువంటి మధు, కైటవులనే ఇద్దరు రాక్షసులు ఉద్భవిస్తారట. పుట్టీపుట్టగానే పాల సముద్రమంతా కలియతిరిగిన ఆ ఇద్దరు సోదరులు.. ఒకరితో ఒకరు తర్కించుకుంటూ.. అసలు మనం ఎవరం? ఎలా పుట్టాం..? ఈ ఉప్పొంగుతున్న ఈ కడలికి ఆధారం ఏమిటి? ఇలా పరిపరివిధాల ఆలోచించుకుంటూ ఆ కడలి మొత్తం తిరుగుతూ ఉంటారు. అక్కడ వారికి బ్రహ్మ కనిపిస్తాడు. వెంటనే వారు విరించి దగ్గరకు వెళ్ళి ఎవరు నువ్వు, నీకు ఇక్కడ ఏం పని అంటూ  ఆయనను తరిమేస్తారు. దీంతో ఏం చేయాలో పాలుపోని బ్రహ్మ...విష్ణువు దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు. అప్పుడు మధు, కైటవులను చూసి చిరు నవ్వు నవ్విన శ్రీహరి .. మీరు నా నుంచి ఉద్భవించారు.. మీకు రాక్షస ప్రవృత్తి తగదు. మీకు ఏం వరం కావాలో కోరుకోండి అనుగ్రహిస్తాను అంటాడు. దానికి ప్రతిగా ఆ రాక్షసులు మేమే అత్యంత శక్తివంతులం...నువ్వు మాకు వరం ఇవ్వడం ఏంటి? మేమే నీకు వరమిస్తామని విష్ణువుతో చెబుతారు. దాంతో శ్రీహరి మీరు కోరుకో అన్నట్లుగానే నేను వరం కోరుకుంటున్నాను. మీరు నా చేతిలోనే మరణించాలి. ఈ వరం ప్రసాదించండి అని అడుగుతాడు. దీంతో ఒక్కసారిగా ఆ సోదరులకు గర్వభంగం కలిగి.. సరే మేము నీ చేతిలోనే మరణిస్తాం. కానీ మేము మరణించే ముందు మాతో యుద్ధం చేయాలి అని అడుగుతారు. వారి కోరికను సమ్మతించిన శ్రీహరి వారితో తలపడతాడు. కొన్నేళ్ల పాటు జరగడంతో ఆ ఇద్దరు సోదరుల అస్త్ర శస్త్రాలన్నీ అయిపోగా.. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరాన్ని తాకుతారు.

విష్ణుమూర్తి శరీరాన్ని తాకగానే.. ఆ ఇద్దరు సోదరులు దివ్యానుభూతి పొందుతారు. వెంటనే ఆయన శరీరం తాకితేనే ఇంత తేజోమయంగా ఉందే.. నిత్యం ఆయన చెంతనే ఉంటే ఇకెంత బాగుంటుందో అని అనుకుని ఆయనతో యుద్ధం చేయడం ఆపేసి.. స్వామి మాకు మీతో యుద్ధం వద్దు.. మీతో పాటు మమ్మల్ని కూడా వైకుంఠానికి తీసుకెళ్లండి. అక్కడ మీతోనే ఉంటూ మిమ్మల్ని నిత్యం తరిస్తూ ఉంటాం అని ప్రార్థిస్తారు. ఆ సోదరుల ప్రార్థనను మన్నించిన శ్రీహరి.. వారిద్దరినీ అనుగ్రహించి వారిని అందరూ వెళ్లే ద్వారం గుండా కాకుండా.. ప్రత్యేక ద్వారం గుండా వైకుంఠం తీసుకెళ్లాలని భావించి.. ఈ రోజున వైకుంఠానికి వచ్చే వారిని ఉత్తర ద్వారం గుండా పంపమని ద్వారపాలకులకు చెబుతాడు.ఆ తరువాత మధు, కైటవులు విష్ణుమూర్తిలో ఐక్యం అయిపోతారు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మాది దేవతలు అప్పటి నుంచి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా వైకుంఠానికి ప్రవేశించి కరుణా కటాక్షాలకు పాత్రులవుతారు. దానినే భూమిపైన మానవులు కూడా ఆచరించడం మొదలెట్టారు. 

తిరుమలలో పది రోజులు..

వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి..ఆలయాల్లో అప్పటి వరకు మూసి ఉన్న ఉత్తర ద్వారం తెరిచి భక్తులను స్వామి దర్శనం చేసుకుంటే పుణ్యమని భావిస్తారు. దేవాలయాలు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. దీనినే తిరుమలలో కూడా ఆచరిస్తున్నారు. అయితే మిగతా అన్ని చోట్లా కేవలం ఒక్క వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఉత్తర ద్వారం ఉంటుంది. కానీ తిరుమలలో పదిరోజుల పాటూ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అయితే ఇదంతా కేవలం కథలు,నమ్మకాల నుంచి పుట్టినదే. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేదు. దాదాపు పురాణ గాథలన్నింటికీ ఇదే అనవాయితీ ఉంటుంది. ప్రజలు నమ్మకం ప్రాతిపదికగానే వీటిని ఆచరిస్తారు. 

#tirumala #vaikunta-ekadashi #today-latest-news-in-telugu
Advertisment
తాజా కథనాలు