/rtv/media/media_files/2025/09/11/pink-diamond-2025-09-11-15-01-45.jpg)
pink diamond
కొన్నేళ్ల నుంచి వివాదంగా ఉన్న తిరుమల పింక్ డైమండ్ వ్యవహారం తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. ఎప్పటి నుంచో వివాదస్పదంగా ఉన్న పింక్ డైమండ్ వ్యవహారంపై తాజాగా స్పష్టత వచ్చింది. శ్రీవారికి మైసూరు మహారాజు బహుకరించిన ఒక హారంలో పింక్ డైమండ్ ఉందని గతంలో కొందరు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలు అబద్ధమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలో తేలింది. ఈ వివాదం 2018లో మొదలైంది. అప్పట్లో తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఒక సంచలన ఆరోపణ చేశారు. మైసూరు మహారాజు శ్రీవారికి ఇచ్చిన హారంలో ఉన్నది మామూలు రాయి కాదని కోట్ల విలువ చేసే పింక్ డైమండ్ అని తెలిపారు. అలాగే ఆ డైమండ్‌ను దొంగిలించి విదేశాల్లో అమ్మేశారని కూడా ఆరోపించారు. అయితే రమణదీక్షితులు చెప్పిన ఆ మాటల్లో నిజం లేదని అప్పట్లో టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఆ హారంలో ఉన్నది ఒక మామూలు కెంపు రాయి మాత్రమేనని టీటీడీ స్పష్టం చేసింది. కానీ ఈ వివాదం అప్పటి నుంచి కొనసాగుతూనే వచ్చింది.
ఇది కూడా చూడండి: BRSకు రూ.685 కోట్ల ఆదాయం.. TDP, YCP లెక్కలు చూస్తే షాక్!
పరిశోధనలు జరిపి..
తాజాగా పురావస్తు శాఖ (ASI) డైరెక్టర్ మునిరత్నం రెడ్డి దీనిపై పరిశోధన చేపట్టారు. మైసూరు ప్యాలెస్ రికార్డులను, పాత ఆభరణాల వివరాలను అన్నింటిని పరిశీలించారు. అలాగే మైసూరు మహారాణి ప్రమోద దేవిని స్వయంగా కలిసి ఈ హారం గురించి వివరాలు అడిగి కూడా తెలుసుకున్నారు. హారంలో ఉన్నది కెంపు రాయి మాత్రమేనని వెల్లడించారు. మైసూరు ప్యాలెస్ రికార్డులను చెక్ చేయగా అందులో పింక్ డైమండ్ లేదని, కేవలం అది కెంపు రాయి మాత్రమేనని అన్నారు. ఆ హారాన్ని ఢిల్లీలోని ఒక షాపులో రూ. 8,500 పెట్టి తయారు చేశారని పాత రికార్డుల ప్రకారం తెలిపారు. ప్యాలెస్‌లోని ఆభరణాల రికార్డుల్లో ఎక్కడా కూడా ఆ హారంలో డైమండ్ ఉన్నట్టు నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చారు. మునిరత్నం రెడ్డి, రమణదీక్షితులు చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. దేవాలయాల విషయాల్లో తప్పుడు ప్రచారం చేయకూడదని, రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు.
అసలు పింక్ డైమండ్ లేదే లేదు..
మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ శ్రీవారికి అనేక విలువైన ఆభరణాలు సమర్పించారు. అందులో ఈ హారం కూడా ఒకటి. ఆయన 1945 జనవరి 9న శ్రీవారిని దర్శించుకుని ఈ హారాన్ని కానుకగా ఇచ్చారు. అప్పటి నుంచి టీటీడీ ఈ హారాన్ని ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తులకు అలంకరిస్తోంది. 2001లో గరుడసేవ సందర్భంగా భక్తులు విసిరిన నాణేల వల్ల ఆ హారంలోని కెంపు రాయి పగిలిపోయింది. ఈ విషయం అప్పటి రిజిస్టర్లలో కూడా నమోదై ఉంది. ఆ పగిలిన రాయి ముక్కలు ఇప్పటికీ పేష్కార్ ఆధీనంలో ఉన్నాయని టీటీడీ వెల్లడించింది.
కెంపు మాత్రమే..
రికార్డుల ప్రకారం ఆ కెంపు రాయి విలువ కేవలం రూ.50 మాత్రమే. అయితే పింక్ డైమండ్ అని రమణదీక్షితులు చేసిన ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో, టీటీడీ ఆయనపై, అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డిపై రూ. 200 కోట్ల పరువు నష్టం దావా వేసింది. భక్తుల మనోభావాలను దెబ్బతీయడం, టీటీడీ ప్రతిష్టను దిగజార్చడం వంటి ఆరోపణల మీద ఈ చర్య తీసుకుంది. అయితే ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసును ఉపసంహరించుకుంది. ఇప్పుడు ASI డైరెక్టర్ మునిరత్నం రెడ్డి పరిశోధనల తర్వాత ఈ పింక్ డైమండ్‌పై క్లారిటీ వచ్చింది. శ్రీవారి హారంలో ఉన్నది ఒక సాధారణ కెంపు రాయి మాత్రమేనని, పింక్ డైమండ్ అనే ప్రచారం తప్పు అని తేలిపోయింది.
ఇది కూడా చూడండి: BREAKING: రతనాల సీమగా రాయలసీమ.. అనంతపూర్ లో పూనకాలు తెప్పించిన పవన్ స్పీచ్-VIDEO