Vijayawada : దసరా నవరాత్రులు నిన్నటి నుంచి మొదలు అయ్యాయి. విజయవాడ దుర్గమ్మ సన్నిధికి నవరాత్రులు సమయంలో నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.
ఈసారి భక్తులకు అమ్మవారి దర్శనాన్ని సులభతరం చేసేందుకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. దసరా ఉత్సవాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని భక్తులకు అందుబాటులో ఉంచేందుకు ‘దసరా 2024’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ యాప్‌లో దర్శన వేళలు.. దర్శన టికెట్ల కొనుగోళ్ల కౌంటర్లు.. పార్కింగ్ ప్రదేశాలు వంటి వివరాలను పొందుపరిచారు. దీంతోపాటు వాట్సాప్ ద్వారా కూడా దసరా ఉత్సవాల వివరాలు పొందేలా అధికారులు ఏర్పాటు చేశారు. 94418 20717 వాట్సాప్ నంబరుకు హాయ్, అమ్మ అని మెసేజ్ చేస్తే భక్తులకు అవసరమైన సమాచారం తెలుసుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు.
అసలు ఈ యాప్ లో ఏమున్నాయంటే!
దసరా 2024 యాప్‌లో దసరా నవరాత్రుల్లో అమ్మవారి దర్శన వేళలను అందులో ఉంచారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి దుర్గగుడి చెంతకు చేరుకునేందుకు వాహనసౌకర్యం ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో తెలిపేలా వివరాలు ఉంచారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్ల వివరాలు, అన్నదానం వివరాలు, దర్శనం టికెట్ల కౌంటర్లు ఎక్కెడెక్కడ ఉన్నాయన్న సమాచారాన్ని ఈ యాప్ లో పెట్టారు.
ఫస్ట్ ఎయిడ్ కేంద్రాల వివరాలు, మరుగుదొడ్లు, చెప్పుల స్టాండ్లు, సమాచార కేంద్రాలు.. వంటి సమస్త వివరాలను ఈ యాప్ లో యాడ్ చేశారు. భక్తులు ఎక్కడైనా ఏదైనా సమస్య ఎదుర్కొంటే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా కల్పించారు. అలాగే ఏవైనా సూచనలు చేయదలచినా దానికీ కూడా అవకాశం ఉంది.
Also Read : ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం