Pawan; సినీ పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం తమ ప్రభుత్వానికి ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం టాలీవుడ్ కు అండగా ఉంటుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ మీద గౌరవం ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తుందన్నారు. టిక్కెట్ల ధరలు పెంచేందుకు గత ప్రభుత్వం మాదిరి హీరోలను పిలవబోమని, టిక్కెట్ల ధరలు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా టాక్స్ రూపంలో ఆదాయం వస్తుందన్నారు. కొంతమంది ధరల పెంపుని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, సినీ ఇండస్ట్రీ గురించి సినిమాలు తీసేవారు మాత్రమే మాట్లాడాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
టిక్కెట్ల ధరలు పెంచేందుకు హీరోలతో పని ఏంటి?
ఈ మేరకు శనివారం సాయంత్రం రాజమండ్రిలో రాంచరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా వచ్చిన పవన్.. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసే వారు నాకు నచ్చరని చెప్పారు. 'తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటే సినిమాలు తీసి దాని సాదకబాధకాలు తెలిసిన వారే మాట్లాడాలి. ఎన్డీఏ ప్రభుత్వం తరఫున చెబుతున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వారితోనే మాట్లాడుతుంది. వారినే గుర్తిస్తుంది. సినిమా టిక్కెట్ల ధరలు పెంచేందుకు హీరోలతో పని ఏంటి? హీరోలు ఎందుకు రావాలి? అలా హీరోలని రప్పించుకోవడం మాకు ఇష్టం లేదు. నిర్మాతలు, ట్రేడ్ బాడీ యూనియన్ వచ్చినా టిక్కెట్ల ధరలు పెంపు ఇస్తాం. గత ప్రభుత్వంలో మాదిరి హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలని ఆలోచించే లో లెవల్ వ్యక్తులం కాదు. మేము స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి చాలా నేర్చుకున్నాం. ఆయన్ని ఎంత మంది విమర్శించినా కలసి నటించేప్పుడు బాగున్నారా అని గుండె నిండుగా పలుకరించేవారు. ఎన్టీఆర్ ప్రభుత్వంపై కృష్ణ లాంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎప్పుడూ ఇతర హీరోల మీద వివక్ష చూపలేదు. చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం అది. దాన్ని మేము కొనసాగిస్తామని చెప్పారు. ఇక గత ప్రభుత్వంలో మాదిరి మీరంతా అభిమానించే మెగాస్టార్ చిరంజీవిలాంటి వారిని గాని, ప్రభాస్ లాంటి వారిని గాని, ప్రిన్స్ మహేష్ బాబు లాంటి వారినిగానీ మేము పిలవం. మాకు చిత్ర పరిశ్రమ మీద గౌరవం ఉందని చెప్పారు.
సమాజాన్ని ఆలోచింపజేసే సినిమాలు..
మనం నిజ జీవితంలో చేయలేని వాటిని సినిమాల్లోని పాత్రల్లో ఊహించుకుని చూస్తామని పవన్ అన్నారు. మననసులో భావన తెరకెక్కించడం వల్లే ఒక్కడు లాంటి సినిమాలు చూస్తాం. ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో శివాజీ లాంటి సినిమాలు చూసి తృప్తిపడతాం. సినిమాలు ఒక మార్గదర్శకం. సినిమాల్లో చాలా విలువలు ఉంటాయి. సినిమాల్లో మంచీ చెడూ రెండూ ఉంటాయి. సినిమాల్లో ఉన్న విలువలు మాత్రమే మనం స్వీకరించాలి. వకీల్ సాబ్ లో ఓ డైలాగ్ నేను చెప్పడానికి ఆలోచించాను. హీరోలు, దర్శకులు సమాజం మీద తీవ్ర ప్రభావం చూపుతారు. సమాజానికి వినోదాన్ని పంచే సినిమాలతోపాటు సమాజాన్ని ఆలోచింప చేసే సినిమాలు రావాలి. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే, ప్రజలకు మంచి నేర్పే సినిమాలు రావాలని కోరకుంటున్నాను. పెరిగిన టిక్కెట్ల ధరలు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. పెరిగిన ప్రతి రూపాయి మీద 18 శాతం జీఎస్టీ వస్తుందని చెప్పారు.