/rtv/media/media_files/2025/04/05/vfXJF2xd5BVmkMrqaTiB.jpg)
Gold Theft
CRIME : ఇంట్లో సొంత కుటుంబ సభ్యలనే నమ్మలేని ప్రస్తుత సమయంలో పనిమనిషిని నియమించుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇళ్లు గుల్లవడమే కాదు ఏకంగా ప్రాణాలు తీసినా ఆశ్చర్యపోనక్కరలేదు. తాజాగా ఒక పనిమినిషి నమ్మించి యజమాని ఇంట్లో రోజుకో నగ ఎత్తుకెళ్లింది. వారు తెలుసుకునేప్పటికీ కోటి రూపాయల విలువైన నగలు చోరీకి గురయినట్లు గుర్తించారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ సూర్యారావుపేట చిలుకుదుర్గయ్యవీధిలో ఒక వైద్యుల కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబంలో అందరూ వైద్యులే. దీంతో ఎవరిబిజీలో వారు తమ విధులకు వెళ్లేవారు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట విజయవాడ మారుతీనగర్‌కు చెందిన చీపురుపల్లి సుమలత అనే మహిళను ఇంట్లో పనిమనిషిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో సుమలత వారింట్లో నగలు చూసింది. నమ్మకంగా పనిచేయడం మొదలు పెట్టింది. ఏడాదికాలంగా నమ్మకంగా పనిచేస్తుండటంతో అంతా నమ్మారు. దీంతో ఇంటి బాధ్యత అంతా ఆమెకే అప్పగించారు. అలా నమ్మకంగా మెలిగిన సుమలత ఒకేసారి దొంగిలిస్తే అనుమానం వస్తుందని తెలిసి..రోజు పని ముగించుకుని వెళ్లేప్పుడు రోజు ఒక నగను తీసుకుపోయేది. అలా ఒకటొక్కటిగా నగలు ఇంటికి చేరవేసింది. అయితే ఇంట్లో వారు బిజీగా ఉండటంతో నగల విషయం పట్టించుకోలేదు. పలు కారణాలతో సుమలత ఆరు నెలల కిందట పని మానేసింది.
ఇదిలా ఉండగా ఇటీవల ఇంటి యజమానులు ఒక ఫంక్షన్‌కు వెళ్లాల్సి రావడంతో నగల కోసం వెతికితే కనిపించలేదు. దీంతో సూర్యారావుపేట పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చేపట్టగా సుమలత అనే మహిళ గతంలో ఇంట్లో పనిచేసి సమానేసిన విషయం తెలిసింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో దొంగతనం బట్టబయలైంది. మొత్తం మీద పనిమనిషే ఇంటి దొంగ అని తేల్చారు. ఆ వైద్యుల కుటుంబం తమ నగలను ఇంట్లోని డబుల్ కాట్, డ్రస్సింగ్ టేబుళ్ల సొరుగుల్లో దాచేవారని తెలిసింది. అయితే పనిమనిషి నమ్మకంగా ఉండటంతో వాటికి తాళాలు వేసేవారు కాదు. ఈ విషయాన్ని పనిమనిషి గమనించింది. రోజుకో నగ చొప్పున మాయం చేసి తన ఇంట్లో పెట్టుకుంటే దొరికిపోతానని తన బంధువుల ఇళ్లలో దాచింది. విచారణలో నేరం ఒప్పుకుని బంగారు ఆభరణాల గురించి చెప్పడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.కోటి విలువైన 837 గ్రాముల స్వర్ణ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు వెల్లడించారు. ఈ మేరకు తన కార్యాలయంలో నిందితురాలి వివరాలను ఆయన వెల్లడించారు.నిందితురాలిని అరెస్టు చేశారు.
Follow Us