/rtv/media/media_files/2024/10/25/7Bod6P6nQLilWLFmMxE3.jpeg)
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు విధించారు.
మామిడి రైతుల సమస్యల పట్ల సమీక్ష కార్యక్రమానికి 500 మందికి మాత్రమే అనుమతినిచ్చామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. గతంలో సత్యసాయి,ప్రకాశం, గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు ఆంక్షలను కూడా విధించారు. పుంగునూరు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని...అందుకే అక్కడ 500 కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదని చెప్పామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనికి పుంగనూరు పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని పుంగనూరు సి.ఐ.సుబ్బారాయడు కోరారు.
జగన్ వాహనమే కారణం..
మరోవైపు వారం క్రితం సింగయ్య మృతికి వైఎస్ జగన్ ప్రయాణించిన వాహనమే కారణమని ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులు.. ఘటన సమయంలో సెల్‌ఫోన్లలో రికార్డయిన వీడియోలు అసలైనవేనని వెల్లడించారు. మార్ఫింగ్ వీడియోలంటూ పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. ఈ మేరకు జగన్ ర్యాలీ సందర్భంగా చిత్రీకరించిన కార్యకర్తల 6 ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు. ఫోన్లలో తీసిన వీడియోలు పరిశీలించగా.. అవన్నీ ఒరిజినల్‌వేనని స్పష్టమైంది. ఇక జూన్ 18న పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా జగన్ వాహనం కింద పడి సింగయ్య చనిపోయారు. మొదట దేవినేని అవినాష్ అనుచరుడి వాహనం ఢీకొన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో వారు అదే విషయాన్ని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అనంతరం జగన్ వాహనం కింద పడి సింగయ్య మరణించిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో కేసు మలుపుతిరిగింది.