/rtv/media/media_files/2025/07/22/rajamundry-jail-2025-07-22-21-35-57.jpg)
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జైలులో వసతుల కల్పనపై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మిథున్ రెడ్డికి జైలులో ఈ విధంగా సౌకర్యాలను కల్పించాలని ఏసీబీ కోర్టు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులను ఆదేశించింది.
ఇనుప మంచం, పరుపు, కుర్చీ
వెస్ట్రన్ కమోడ్‌తో కూడిన ప్రత్యేక గది, మూడు పూటలా ఇంటి నుండి ఆహారాన్ని తెప్పించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆయనకు అవసరమైన ఐదు రకాల మందులు తీసుకునేందుకు అనుమతి. సర్వైకల్ సమస్య ఉన్నందున ప్రత్యేక దిండ్లు కూడా అనుమతించారు. ఇనుప మంచం, పరుపు, కుర్చీ, టేబుల్, పెన్ను, పేపర్లు, దోమ తెర, యోగ మ్యాట్, వాకింగ్ షూస్, మినరల్ వాటర్ బాటిల్స్ కల్పించాలని కోర్టు స్పష్టం చేసింది.
రోజువారీ వార్తాపత్రికలు, మ్యాగజైన్స్‌తో పాటు టీవీ కూడా ఏర్పాటు చేయాలంది. ఆయనకు అటెండెంట్‌ను కూడా కేటాయించాలంది కోర్టు. బయటి ఆహారం తీసుకువస్తే అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. జైలులో ఉన్న వైద్య వసతి కల్పించాలని.. అవసరమైతే జైలు బయట వైద్య సౌకర్యం కల్పించాలని సూచించింది. న్యాయవాదులకు వారంలో మూడు సార్లు, బంధువులకు వారంలో రెండు సార్లు ములాఖత్‌లకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆదేశాల అమలుపై జైలు అధికారులు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.