Kakinada Tuition Master Incident: పిల్లలకు పాఠాలు చెబుతానని నమ్మించాడు.. తానొక మంచి టీచర్ని అని పంచన చేరాడు. తీరా చూస్తే నాలుగు నెలల కాలంలో మాయ మాటలు చెప్పి, వయసులో ఉన్న ఇద్దరు బాలికలను అపహరించుకోపోయాడు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో (Dowleswaram) జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తన పిల్లలను తనకు తిరిగి అప్పగించాలని, తన సమస్యను తీర్చాలని బాధిత తల్లి అధికారులను వేడుకుంటుంది. పిఠాపురంలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లిన బాధిత తల్లి తన సమస్యను మాజీ ఎమ్మెల్యే వర్మకు (Pithapuram Varma) తెలిపింది. బాధితురాలి నుండి వివరాలు తీసుకున్న వర్మ నారా లోకేష్‌కు (Nara Lokesh) ఎక్స్ లో పోస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు.
అసలేం జరిగిందంటే?
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బోర్డు వీధికి చెందిన మేధవలం సునీత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒకరు 10వ తరగతి చదువుతుండగా, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు. నాలుగు నెలల క్రితం సునీత అద్దెకు ఉంటున్న గృహంలో మరో పోర్షన్‌లోకి విజయనగరానికి చెందిన మారోజు వెంకటేష్ అనే యువకుడు అద్దెకు దిగాడు. తాను టీచర్ ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికాడు. విద్యార్థులకు ట్యూషన్ చెప్తానని నమ్మించడంతో సునీత తన కుమార్తెలు ఇద్దరినీ అతని వద్ద ట్యూషన్ కు పెట్టింది.
Also Read: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు…ఇక నుంచి ఆ పేరుతో!
బాలికలను ట్రాప్ చేసి..
ట్యూషన్ కొద్దికాలం సజావుగానే సాగింది. అనంతరం వెంకటేష్ ఆ ఇద్దరి బాలికలను ట్రాప్ చేశాడు. 15 రోజుల క్రితం ఇద్దరు బాలికలతో మారోజు వెంకటేష్ ఇంటి నుండి పరారయ్యాడు. తన బిడ్డలకు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేశాడని బాధితురాలు సునీత ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
మంత్రి లోకేష్ దృష్టికి..
అయితే కేసులో పురోగతి లేకపోవడంతో విషయాన్ని నేరుగా సీఎం చంద్రబాబుకు (CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ కు తెలిపేందుకు ప్రయత్నాలు చేసింది. చివరకు మాజీ ఎమ్మెల్యే వర్మ ద్వారా తెలిపేందుకు కుటుంబ సభ్యులతో కలిసి పిఠాపురం వెళ్లింది. టీడీపీ కార్యాలయానికి వెళ్లి, వర్మను కలిసి సమస్యను వివరించింది. స్పందించిన వర్మ వెంటనే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఇదే విషయాన్ని నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని వర్మ వెల్లడించారు. బాధితురాల నుండి పూర్తి వివరాలు తెలుసుకున్న వర్మ తన ఎక్స్ ఖాతా ద్వారా విషయాన్ని లోకేష్ కు తెలిపారు.
పోలీసులు స్పందించడం లేదు : సునీత
తన కూతుళ్లు కనిపించడం లేదని మారోజు వెంకటేష్ అనే టీచర్ కిడ్నాప్ చేశాడని ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని సునీత వెల్లడించింది. పోలీస్ స్టేషన్ కు వెళ్తే వెటకారంగా మాట్లాడుతున్నారని, మీ కూతుర్లు ఇష్టపడే వెళ్ళిపోయారంటూ బదులిస్తున్నారని వాపోయింది. తనకు చంద్రబాబు, లోకేష్ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని ఆమె కన్నీటి పర్యంతమైంది. భర్తతో కలిసి ఉండటం లేదని ఇదే చనువుగా చేసుకుని తనను వెంకటేష్ మోసం చేశాడని చెప్పింది. తన కూతుళ్లు లేకపోతే తనకు బతుకే లేదని విలపిస్తోంది. ప్రభుత్వం స్పందించి తన కూతుళ్ల ఆచూకీ కనిపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.