YS Jagan to release funds: ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలను అందుకోకుండా మిగిలిపోయిన అర్హులైన వారికి గురువారం డబ్బులు విడుదల చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు వివరించింది.
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతోనే 2022 డిసెంబర్ నుంచి 2023 జులై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన..కొన్ని కారణాలతో లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు మొత్తం రూ.216.34 కోట్లను ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.
ఈ పథకంలో ఇంతకు ముందే సంక్షేమ పథకాలు అందుకున్న వారితో పాటు కొత్తగా అర్హత పొందిన వారు కూడా ఉన్నారు. అదనంగా మరో 1,49,875 మందికి నూతనంగా ఫించన్లు, 4,327 మందికి కొత్తగా ఆరోగ్య శ్రీ కార్టులు (Aarogyasri Card), 2,00,312 మందికి కొత్తగా రేషన్ కార్డులు (Ration Card), 12,069 మందికి నూతనంగా ఇళ్ల పట్టాలను ఈ సందర్భంగా అధికారులు అందజేయనున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్నప్పటికీ కూడా కొందరు లబ్ధి పొందలేకపోయారు. అయితే ఈ పథకాలను అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్లు అన్ని పరిశీలించిన తరువాత మిగిలిన అర్హులకు కూడా ఆర్నెళ్లకు ఒకసారి ప్రభుత్వం సంక్షేమ పథకాలను (Govt Schemes) అందిస్తున్న విషయం తెలిసిందే.
అర్హులైనప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల కొంతమంది సంక్షేమ పథకాలను అందుకోలేకపోయారు. అలాంటి వారి ప్రయోజనాలను అన్నింటిని కలిపి 2021 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తంగా నాలుగు సార్లు రూ.1,647 కోట్లు వరకు నిధులు అందనున్నాయి. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కూడా 94,62,184 సర్టిఫికేట్లు జారీ చేయగా..వాటితో కలిపి కొత్తగా వచ్చిన మరో 12 , 405 మందికి కూడా ఈరోజే నగదు అందజేయనున్నారు.
అంతేకాకుండా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులో కూడా అర్హులైన 1630 మందికి ప్రయోజనాలు అందనున్నాయి. అర్హులై ఉండి, ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తోంది ప్రభుత్వం. ఏడాదిలో రెండుసార్లు వారికి డబ్బుల్ని జమ చేస్తారు.
Also Read: సింహాద్రి అప్పన్నకు వందకోట్ల చెక్!