ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర(Anand mahindra) సోషల్ మీడియాలో(social media) చాలా యాక్టివ్ గా వుంటారు. ఎప్పటిలాగే ఆయన మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సారి ఆఫ్రికాలోని కెమరూన్(cameroon) ప్రాంతంలో ఓ చింపాంజీ(chimpanzee) వీడియోను ఆయన షేర్ చేశారు. వీడియో షేర్ చేయడమే కాదు చింపాంజీ మనకు ఓ అద్బుతమైన పాఠాన్ని చెబుతోందంటూ తెలిపారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇంతకు ఆ వైరల్ వీడియోలో ఏముందంటే...!
ఆఫ్రికాలోని కెమెరూన్ ప్రాంతంలో ఓ చింపాంజీ దాహంతో కనిపించింది. ఓ చోట నీటి గుంట కనిపించగా అక్కడ కూర్చుంది. నీళ్లు తాగేందుకు ఓ వ్యక్తి సహాయం కోరింది. వెంటనే ఆ వ్యక్తి చేతిని దోసిలిగా చేసి తన చేతులతో నీళ్ల వద్దకు తీసుకు వెళ్లింది. దోసిలితో ఆ వ్యక్తి నీళ్లు అందించగా చింపాంజీ కడుపు నిండా నీళ్లు తాగింది. దీంతో ఆ చింపాంజీ దాహం తీరింది.
కానీ కథ ఇక్కడితో ముగియలేదు. సాధారణంగా అయితే జంతువులు నీళ్లు తాగిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాయి. లేదా కొన్ని జంతువులైతే ఆ వ్యక్తి తల నిమరడం లాంటివి చేసి కృతజ్ఞత తెలుపుతూ వుంటాయి. అయితే ఈ చింపాంజీ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది. నీళ్లు తాగించిన తర్వాత అతని చేతులను చింపాంజీ నీటితో కడిగింది. ఈ చింపాంజీ మర్యాద ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోను ఆనంద్ మహేంద్ర షేర్ చేశారు. ఆ చింపాంజీ నుంచి మనం గొప్ప పాఠాన్ని నేర్చుకోవాల్సి ఉందన్నారు. మనం జీవితంలో సక్సెస్ కావాలంటే మన కమ్యూనిటీలో, మన చుట్టూ వున్న వారికి, మన ఆఫీసు ఇలా అందరికి మనం సహాయం చేయాలన్నారు. దీనికి బదులుగా అవసరం వచ్చినప్పుడు వారంతా మనకు సహాయం చేస్తారని చెప్పారు. ఈ సూత్రాన్ని జీవితంలో అందరూ పాటించాలన్నారు.
ఇంత గొప్ప వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రాకు నెటిజన్లు ధన్యవాదాలు చెబుతున్నారు. అద్బుతమైన సందేశం ఇచ్చారని నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియోకు పెద్ద ఎత్తున లైక్ లు కొడుతున్నారు. పనిలో పనిగా షేర్ కూడా చేస్తున్నారు. నిజంగా ఆ చింపాంజీ చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు.