విపక్ష‘ఇండియా’కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. విపక్ష కూటమిని పాత సీసాలో పాత వైన్ అంటూ ఫైర్ అయ్యారు. 12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిన గ్రూపు అది అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 11 వ స్థానాన్ని దాటి వెళ్ల లేకపోయిందని తెలిపారు.
ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి చేరుకుందన్నారు. గుజరాత్ లోని గాంధీ నగర్ లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ప్రాంతీయ కార్యాలయానికి అమిత్ షా శంకుస్థాపన చేశారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.... యూపీఏ, కాంగ్రెస్ నేతలు రూ. 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని తీవ్ర విమర్శలు గుప్పించారు. వాళ్లు ఇప్పుడు పేరు మార్చుకున్నాురని చెప్పారు. మీరు వారిని ఇప్పుడు యూపీఏ అనే పిలవాలన్నారు.
రూ. 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన ఆ నేతలకు మళ్లీ ఎవరు ఓటు వేస్తారు? అని ప్రశ్నించారు. మీరు ‘కొత్త సీసాలో పాత సారా’ అనే సామెతను విన్నారా అని అడిగారు. కానీ ఇక్కడ మాత్రం సీసా, సారా రెండు కూడా పాతవేనన్నారు. అందువల్ల మీరంతా మోసపోవద్దని ప్రజలకు ఆయన సూచించారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి మోడీ సర్కార్ అధికారంలోకి వస్తుందన్నారు.
మనలో చాలా మంది స్వాతంత్రోద్యమాన్ని చూడలేదని, ఆ పోరాటంలో పాల్గొనే అవకాశం దొరకలేదన్నారు. చాలా మంది తమకు అవకాశం దొరికి వుంటే ఈ దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి వుండేవాళ్లమని చెబుుతారని పేర్కొన్నారు. మనం దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. మనమంతా ఈ దేశం కోసం బతికితే సరిపోతుందన్నారు.