Kishan Reddy: దేశంలో పేదరికం లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాంపల్లిలోనీ బీజేపీ కార్యాలయంలో జరిగిన 77వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

New Update
Kishan Reddy: దేశంలో పేదరికం లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

స్వాతంత్ర్య సమరయోధుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టేందుకు ఎందరో తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఎందరో మహానుభావులు స్వాంతంత్ర్య పోరాటంలో పాల్గొని ఆంగ్లేయుల నుంచి దేశానికి విముక్తి కల్పించారన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.

మరోవైపు 2047 నాటికి దేశంలో పెదరికం లేకుండా చేస్తామన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయన్నారు. బుజ్జగింపు, కుటుంబ, అవినీతి, నియంతృత్వ రాజకీయాలకు దూరంగా ఉండాలని దేశంలోని ప్రతీ పౌరుడు ప్రతిజ్ఞ చేయాలన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్‌ రెడ్డి.. కేసీఆర్‌ 2014 నుంచి నేటి వరకు చేయని అవినీతి లేదన్నారు. ఇసుక, భూ మాఫియాకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ అధోగతి పాలవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌ భూములు కనిపిస్తే ఆక్రమించి వాటిని వేలం ద్వారా తన బినామీలకు కట్టబెడుతున్నారని.. ధరణి పేరుతో బీఆర్ఎస్ సర్కార్ రైతుల పొట్టగొడుతుందని ఆరోపించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున మద్యం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బంధి అయ్యిందని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే వారిని నిర్భందిస్తున్నారన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసి మళ్లీ వాటిని రద్దు చేస్తే లక్షలు పెట్టి సంవత్సరాల పాటు కోచింగ్ తీసుకున్న అభ్యర్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. విశ్వ విద్యాలయాలు అసాంఘిక కార్యాక్రమాలకు అడ్డాగా మారాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ చేస్తున్న అవినీతి గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ ఎందుకు ప్రశ్నించడం లేదన్న ఆయన.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనన్నారు. గతంలో కాంగ్రెస్‌ పాలకులు కమీషన్లు తీసుకుంటే.. ప్రస్తుతం బీఆర్ఎస్ పాలకులు వాటాలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని విమర్శించారు. నియంత పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్న కిషన్‌ రెడ్డి.. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. నెత్తిమీద ఉన్న కుంపటిని ఎప్పుడు దించుదామా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జోస్యం చెప్పారు.

Advertisment
తాజా కథనాలు