డాక్టర్ గారు..ఈ నాగుపాము నన్ను కాటేసింది...వెంటనే ఇంజక్షన్ చేసి నన్ను కాపాడండి అంటూ ఓ యువకుడు ఆసుపత్రికి వచ్చాడు. తన వెంట తెచ్చిన సంచిలో నాగుపామును తీసి ఆసుపత్రి బెడ్ మీద పెట్టడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ గురవ్వడంతో పాటు భయంతో పరుగులు తీశారు.
ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మీర్జాపూర్ లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతుల్జీ గ్రామంలో సూరజ్ అనే యువకుడు ఉంటున్నాడు. అతనిని సోమవారం నాగుపాము కాటేసింది. అయితే సూరజ్ ఎంతమాత్రం భయపడకుండా..తనను కాటేసిన పామును పట్టుకుని ఓ సంచిలో బంధించాడు.
చికిత్స కోసం మీర్జాపూర్ ప్రభుత్వాసుపత్రికి బైక్ పై వెళ్లాడు. డైరెక్టుగా ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి..తనని నాగుపాము కాటుకు గురయ్యానని, వెంటనే చికిత్స అందించడంతో పాటు ఇంజక్షన్ ఇవ్వాలని వైద్యులను కోరాడు. అంతటితో ఆగకుండా తనని కాటేసిన పాముని సంచిలో నుంచి బయటకు తీసి వార్డులో ఉన్న బెడ్ మీద పెట్టాడు.
ఆ పాము 4-5 అడుగులు ఉండడంతో అక్కడి వైద్యులతో పాటు వార్డులో ఉన్న ఇతర రోగులు, ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కొందరైతే బయటకు పరుగులు తీశారు. వెంటనే వైద్యులు పామును సంచిలో పెట్టాలని సూరజ్ ని కోరడంతో అతను పామును బంధించి సంచిలో పెట్టాడు.
తరువాత డాక్టర్లు సూరజ్ కు యాంటీవీనమ్ ఇంజక్షన్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also read: టీటీడీలో ఉద్యోగాలు..అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్!