సాధారణంగా మనుషులు కనిపించకపోతే.. సంబంధిత వ్యక్తులు వారి ఆచూకీ చెప్తే నగదు బహుమతి ఇస్తామంటూ పోస్టర్లు వేస్తారు. అయితే ఇక్కడ మాత్రం వారు ఎంతో గారాబంగా పెంచుకున్న చిలుక ఎక్కడికో ఎగిరిపోయిందట. దీంతో హర్ట్ అయిన యజమానులు 'మా చిలుక ఆచూకీ చెప్తే.. పది వేల రూపాయలు నగదు ఇస్తామంటూ' పలు పోస్టర్లలో ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ కు చెందిన దీపక్ అనే వ్యక్తి.. ఎంతో కాలం నుంచి ఓ చిలుకను పెంచుకుంటున్నాడు. అయితే అది ఇటీవల ఎక్కడికో ఎగిరిపోయింది. దీంతో దీపక్ పెంపుడు చిలక ఆచూకీ చెప్తే.. రూ.10 వేలు నగదు ఇస్తామంటూ పోస్టర్లు వేయించాడు.
చిలుక తప్పిపోయిన సమయంలో సరిగ్గా ఎగరలేని స్థితిలో ఉందని, వీధి కుక్కలు ఏమైనా దాడి చేశాయోమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. చిలక గత రెండేళ్లుగా తమతో ఉంటుందని, అందుకే అదంటే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని తెలిపాడు.
అందుకు దాని ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేలు, అంతకంటే ఎక్కువ చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. ఇప్పటికే అన్ని చోట్లా వెతికాడు. ఆటో, రిక్షా డ్రైవర్లకు చెప్పాడు. చిలుక ఆచూకీ తెలిపిన వారు తన నెంబర్ కు కాల్ చేయండి అంటూ వాల్ పోస్టర్లు వేయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.