పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. 24 గంటల వ్యవధిలోనే 9 మంది శిశువులు మరణించడం కలకలం రేపింది. ముర్షిదాబాద్ వైద్య కళాశాలలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుకున్న ప్రభుత్వం.. చిన్నారుల మరణాలకు గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాథమిక నివేదిక ప్రకారం.. చిన్నారులందరూ పోషకాహార లోపం, అతితక్కువ బరువుతో ఉన్నారని.. అలాగే ఓ చిన్నారి గుండె సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిసింది. అయితే మరణించిన శిశువుల్లో ముగ్గురు ముర్షిదాబాద్ వైద్య కళాశాలలో జన్మించారని.. మిగిలిన శిశువులను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: రేపటి నుంచే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. అవి ఉండాల్సిందే!
అయితే ఆ చిన్నారులు ఆరోగ్యం క్షీణించడంతోనే మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి తీసుకొచ్చారని .. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో చిన్నారులు మృతి చెందినట్లు తెలిపాయి.జాంగిపుర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని.. అందుకే చిన్నారులను ముర్షిదాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. గత నెలరోజుల్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 380 మంది శిశువులను మెరుగైన చికిత్స కోసం ముర్షిదాబాద్‌కు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఒకేసారి 9 మంది చిన్నారులు మృతిచెందడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే మిగతా ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నవారిలో తమ పిల్లల క్షేమం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.