ఏడేళ్లు.. 70 పేపర్ లీక్ ఘటనలు.. నష్టపోయిన అభ్యర్థుల సంఖ్య కోటి 70లక్షల మంది. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే.. 77ఏళ్ల స్వతంత్ర భారతంలో విద్యావ్యవస్థ నడుస్తున్న తీరు ఇది. దేశం అభివృద్ధి చెందాలంటే విద్యారంగం పటిష్టంగా ఉండాలి. అయితే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, లంచగొండితనం, అవినీతి యావత్ దేశాన్ని, కోట్లాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తోంది. పేపర్ లీక్ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. జాతీయ స్థాయి పరీక్షలు ఒకదాని తర్వాత మరొకటి వివాదాల్లో చిక్కుకోవడం విస్మయం కలిగిస్తోంది.
గత ఏడేళ్లలో 15 రాష్ట్రాల్లో 70కి పైగా పరీక్షలు లీకైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ లీకులు వల్ల ప్రత్యక్షంగా కోటి 70 లక్షల మంది దరఖాస్తుదారుల ప్రభావితమయ్యారు. 24 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఒక నీట్-యూజీ పరీక్ష ద్వారానే ఇబ్బందులు పడ్డారు. అటు యూజీసీ నెట్ పరీక్ష జరిగిన మరుసటి రోజే అవకతవకలు జరిగాయని కేంద్రం చెప్పడం, పరీక్షను క్యాన్సిల్ చేయడం షాక్‌కు గురి చేసింది. నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీకేజీలు NTA సమగ్రతను ప్రశ్నిస్తున్నాయి. పరీక్షల నిర్వహించడం కూడా చేతకాదా అని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు CSIR-UGC-NETతో పాటు నీట్-పీజీ పరీక్ష కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో NTA పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: మహిళా కానిస్టేబుల్‌తో డీఎస్పీ అక్రమ సంబంధం.. కట్ చేస్తే కానిస్టేబుల్‌గా డిమోట్
అటు కేవలం కేంద్రం నిర్వహించే ప్రశ్న పత్రాలు మాత్రమే లీక్ అవుతున్నాయని అనుకుంటే పొరపాటే. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలలో గత ఏడేళ్లలో పేపర్ లీక్స్‌లో ఘటనలు జరిగాయి. పేపర్ లీకేజీలు మేజర్ రిక్రూట్ మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ పరీక్షలకే పరిమితం కావడంలేదు. స్కూల్ ఎగ్జామ్స్‌లోనూ ఇవి కనిపిస్తున్నాయి. ఉదాహరణకు బీహార్ బోర్డు 10వ తరగతి పరీక్షా పత్రాలు ఆరుసార్లు లీకయ్యాయి. పశ్చిమబెంగాల్‌లో ఏడేళ్లలో కనీసం 10 సార్లు రాష్ట్ర బోర్డు పరీక్ష పేపర్ లీక్ అయింది. తమిళనాడులో 2022లో 10వ తరగతి, 12వ తరగతి పరీక్షా పత్రాలు లీకయ్యాయి. 2015 నుంచి 2023 వరకు రాజస్థాన్, గుజరాత్‌లలో 14కు పైగా పేపర్ లీక్ ఘటనలు జరిగాయి. 2017 నుంచి 2024 మధ్య ఉత్తరప్రదేశ్‌లో వివిధ పరీక్షల్లో 9 ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, హరియాణా సహా పలు రాష్ట్రాల్లోనూ గత ఏడేళ్లలో ఇలాంటి పేపర్ లీకేజీ ఘటనలు ఎక్కువగా జరిగాయి.
పేపర్ లీకేజీ ఘటనలను అదుపు చేసేందుకు 2024లో పార్లమెంట్‌లో చట్టం చేశారు. పేపర్ లీక్‌కు కారణమైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఇంతటి చట్టాలు ఉన్నప్పటికీ ఏ మాత్రం ఉపయోగం ఉన్నట్టు కనిపించడంలేదు. ఎందుకంటే అసలు పేపర్ లీక్ అవ్వకుండా ఏం చేయాలన్నదానిపై ఆలోచించాలి కానీ.. పేపర్ లీక్ తర్వాత పడే శిక్షల గురించి ఎక్కువగా ఫోకస్ చేయడంలో పెద్దగా ప్రయోజనం ఉండదన్న వాదన వినిపిస్తోంది.ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనల్లో పెద్ద మొత్తంలో నగదు మార్పిడి జరిగినట్లు పోలీసుల దర్యాప్తులు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రింటింగ్ ప్రెస్ ల సిబ్బంది ప్రమేయం కూడా ఉందని అనేక ఘటనలు బహిర్గతం చేస్తున్నాయి. ఇక లీకైన పత్రాలను వేగంగా సర్క్యులేట్ చేయడం, వ్యాప్తి చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది నిమిషాల వ్యవధిలోనే వేలాది మంది అభ్యర్థులకు చేరుతుంది. వందల సంఖ్యలో మాత్రమే ఉండే సీట్ల కోసం వేల మంది అభ్యర్థులకు ప్రశ్నా పత్రాలు లీక్ అవుతుండడంతో అసలు కష్టపడి చదివిన వారికి సీటు రాకుండా పోతోంది.
Also Read: నీట్ పరీక్ష అక్రమాలపై సీబీఐ కేసు నమోదు..
చాలా సందర్భాల్లో పేపర్ లీకేజీ తర్వాత చాలా కాలం పాటు పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ గ్యాప్ వల్ల ప్రిపేర్ అయిన అభ్యర్థులు బాగా నష్టపోతున్నారు. పరీక్ష ఎప్పుడు పెడతారో తెలియక, అప్పటివరకు చదివినదాన్ని కూడా గుర్తుపెట్టుకోవడంలేదు. అన్నిటికంటే ముఖ్యంగా షెడ్యూల్ పరంగా పరీక్షను నిర్వహించకపోతే అభ్యర్థులకు ఇంట్రెస్టు పోతుంది. దీని కారణంగా కోట్లాది మంది అభ్యర్థుల భవిష్యత్ నాశనమవుతోంది. జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల్లోనూ ఇంతటి గందరగోళం ఉండడం దేశానికి ఏ మాత్రం మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.