రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఐఐటీ-జేఈఈకి సిద్ధమవుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాదిలో ఇది 11వ మరణం కావడం దుమారం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని మోతీహారీకి చెందిన ఆయుష్ జైస్వాల్ (17) గత రెండు సంవత్సరాలుగా కోటాలో ఐఐటీ-జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు. స్నేహితులతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శనివారం రాత్రి ఆయూష్ గదినుంచి బయటకు రాకపోవడంతో అతడి స్నేహితులు ఇంటి యజమానికి చెప్పారు. ఎన్నిసార్లు పిలిచిన ఆయుష్ తలుపు తీయకపోవడంతో చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం!
వారు ఘటనాస్థలానికి చేరుకొని తలుపులు పగలగొట్టగా లోపలికి వెళ్లగా ఆయుష్ ఉరివేసుకొని కనిపించాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే గదిలో సూసైడ్ నోట్ కనిపించలేదు. ఆయుష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా వివిధ పోటీ పరీక్షల కోసం చాలామంది విద్యార్థులు కోటాలో కోచింగ్‌లు తీసుకుంటారు. కానీ ఈమధ్య కాలంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. చదువుల్లో ఒత్తిడి కారణంగానే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది అక్కడ 26 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కూడా ఆత్మహత్యలు ఆగడం లేదు.