Manipur Violence : మణిపూర్ (Manipur)లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. కొద్దిరోజుల క్రితం శాంతి పునరుద్ధరణలో భాగంగా ఓ తిరుగుబాటు వర్గంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఇలా జరిగిన అనంతరం రాష్ట్రంలో ఘర్షణలు తగ్గుముఖం పడతాయని అందరూ అనుకున్నారు. కానీ సోమవారం మళ్లీ రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందారు. ముందుగా అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. స్థానిక అధికారులు, అస్సాం రైఫిల్స్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున తెంగ్నౌపాల్ జిల్లాలోని లితు అనే గ్రామం దగ్గరి నుంచి ఓ తిరుగుబాటు బృందం మయన్మార్ వైపుగా వెళ్తోంది. ఈ క్రమంలోనో ఆ ప్రాంతంలో ఉన్న మరో సంస్థ సభ్యులు వాళ్లపై కాల్పులు జరిపారు.
Also Read: ఆసక్తికర ఫలితాలు.. కేవలం 16 ఓట్ల తేడాతోనే గెలుపు..
దీంతో ఆ తిరుగుబాటు బృందం కూడా వీళ్లపై కాల్పులు జరిపింది. ఇరువర్గాల మధ్య కాల్పులు జరగడంతో 13 మంది మృతి చెందారు. సమాచారం మేరకు అస్సాం రైఫిల్స్ బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే ఈ దాడుల్లో మరణించిన వారు ఏ వర్గానికి చెందిన వారు అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అక్కడి అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. గతవారం కూడా ఇంఫాల్ లోయలోని తిరుగుబాటు గ్రూపు అయిన యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌తో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం జరిపిన శాంతి చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ఢిల్లీలో శాంతి ఒప్పందంపై ఆ తిరుగుబాటు గ్రూపు సంతకం చేసింది. ఆదివారం తెంగ్నౌపాల్ జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో కుకీ-జో గిరిజన వర్గాలు ఆ శాంతి ఒప్పందాన్ని స్వాగతిస్తూ తీర్మానం కూడా చేశాయి. అనంతరం కొన్ని ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ (Internet) సేవలను పునరుద్ధరించింది. అయితే ఇలా జరిగిన కొన్నిరోజులకే మరోసారి కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపింది.
Also Read: ఆ శాఖే కావాలి!.. పట్టు వీడని సీనియర్లు