ఖమ్మం జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల హాడావుడి షురూ అయ్యింది. తాజాగా వైఎస్సార్టీపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ ఖమ్మ జిల్లా నుంచే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు డిసైడ్ అయ్యారు. అయితే తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలో నేడు పాలేరుకు వైఎస్సార్టీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెళ్లనున్నారు. పాలేరు నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరు కానున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పాలేరు నుంచి విజయమ్మను బరిలో దించాలని షర్మిల యోచిస్తోంది. ఇందులో భాగంగానే నేడు కార్యకర్తల సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: ఇదేందయ్యా సామీ..పగలంతా ఉక్కపోత..రాత్రంతా గజగజ చలి..తెలంగాణలో విచిత్ర వాతావరణం..!!
అటు కొత్తగూడెం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల నుంచి వైఎస్సార్టీపీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ విజయమ్మ రాకతో పాలేరు రాజకీయ ముఖచిత్రం మారనున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పాలేరులో కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున కందాల ఉపేందర్ రెడ్డి తలపడుతున్నారు.
వైఎస్ విజయమ్మ బరిలోకి దిగితే కాంగ్రెస్ ఓటు బ్యాంకులో చీలిక వచ్చే ఛాన్స్ ఉందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్ తో వైఎస్ షర్మిల సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరికను రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడ్డుకున్నారన్న ఆక్రోశంతో వైఎస్సార్టీపీ వర్గీయులు ఉన్నారు. ఈసారి బరిలోకి దిగి వైఎస్సార్టీపీ సత్తా చాటాలని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం… నటుడు అనుమానాస్పద మృతి..!!