Sharmila Letter To PM Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు వారలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ సమయాన్ని అన్నీ రాజకీయా పార్టీలు చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాయి. తమదైన రీతిలో ప్రచారాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు నాయకులు. ఇదిలా ఉంటే YSTRP అధ్యక్షురాలు షర్మిల మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ సంపద కొల్లగొట్టేందుకే కేసీఆర్ పనిచేస్తున్నాడని మండిపడ్డారు. తాజాగా కాళేశ్వరం బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి గురించి ప్రధాని మోదికి లేఖ రాశారు షర్మిల.
ఈ విషయాన్నీ షర్మిల ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆమె ట్విట్టర్ లో.."కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు మరియు అవినీతిపై జోక్యం చేసుకుని వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీ నరేంద్ర మోదీగారికి గట్టి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు అవినీతి, అక్రమాలు మరియు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఆరోపణలు, ఇవన్నీ బహిర్గతం అయినప్పటికీ, మరియు ప్రాజెక్ట్ వైఫల్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం ఆందోళన చేస్తున్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలలకు ఆదేశించకుండా మౌనముద్ర ధరించడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం, అలాగే తెలంగాణ సమాజం యావత్తు ఆవేదన చెందుతోంది. దేశాన్ని 1.20 లక్షల కోట్ల రూపాయలకు మోసం చేసి, తన జేబులు నింపుకోవడానికి మరియు తన కుటుంబ నికర సంపదను పెంచుకోవడానికి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును తుప్పుపట్టించి, పనికిమాలినదిగా చేసిన ఈ తీవ్ర పరిస్థితుల్లో, ఈ జాతీయ విపత్తుపై కనీసం ఇప్పటికైనా స్పందించి చర్యలకు, విచారణకు ఆదేశించాల్సిందిగా ప్రధాన మంత్రికి మనవి చేసాము. మేము చాలా కాలంగా ప్రాజెక్ట్ సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేస్తున్నాము. ఈ ప్రాతినిధ్యం కేవలం వైయస్ఆర్టీపి మాటగా మాత్రమే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతు మరియు బాధ రంగరించి రాస్తున్న లేఖ" అని రాసుకొచ్చారు. మరి షర్మిల లేఖపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.