YS Sharmila Comments on CM Jagan: ఏపీ సీఎం, తన సోదరుడు జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి వివేకా (YS Viveka) 5వ వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడాతూ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి..
ఈ మేరకు షర్మిలా మాట్లాడుతూ.. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతలే అని చెప్పారు. 'ఆయన ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదు. హంతకులు ఎవరో కాదు.. బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. బాధితులకు భరోసా ఇవ్వాలనే ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా? ఇప్పటి వరకు హత్య చేసిన, చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు. చివరి క్షణం వరకు చిన్నాన్న వైసీపీ (YCP) కోసమే పనిచేశారు' అని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Viral: 60 ఏళ్ల ప్రేమ.. హృదయాలను గెలుచుకున్న వృద్ధ దంపతుల కథ!
తమ్ముడి వ్యక్తిత్వ హననం..
అలాగే ' సాక్షిలో పైన వైఎస్ ఫొటో.. కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం. జగనన్నా.. అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా? ఆయన వారసుడిగా మీరేం చేశారో ఒకసారి ఆలోచించండి' అంటూ షర్మిల ప్రశ్నించారు.