YCP - Janasena : ఏపీ(Andhra Pradesh) లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మరో నాలుగునెలల్లో ఎన్నికలు జరుగనుండడంతో నాయకులు తమకు ఏ పార్టీలో కలిసి వస్తోందో అని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా అటు నుంచి ఇటు జంప్ లు కొడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ జనసేన(Janasena) లో చేరుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు.
ప్రస్తుతం ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా వంశీకృష్ణ ఉన్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన వంశీకృష్ణ ఈ సారి ఎలాగైనా పోటీ చేసి విజయం సాధించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 27వ వార్డు కార్పొరేటర్ గా పోటీ చేసి మేయర్ పదవి ఆశించి భంగపడ్డారు. గాజువాక నుంచి వైసీపీ అధ్యర్థిగా పోటీ చేయాలని వంశీని గతంలో వైసీపీ పెద్దలు కోరినట్లు తెలుస్తోంది.
అయితే వంశీ మాత్రం విశాఖ తూర్పు టికెట్ ఇవ్వాలని కోరారు. ఇందుకు వైసీపీ అధిష్టానం నో చెప్పడంతో పార్టీ మారే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఫ్యామిలీ తో వంశీకి మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో ఆయన టీడీపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కుదరకపోతే జనసేనలోకి అయినా వెళ్లి పొత్తుల్లో భాగంగా టీడీపీ (TDP) మద్దతుతో పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.