చిత్తూరు జిల్లా బంద్‌కు వైసీపీ పిలుపు

చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటనకు నిరసనగా వైసీపీ రేపు చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

New Update
చిత్తూరు జిల్లా బంద్‌కు వైసీపీ పిలుపు

చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటనకు నిరసనగా వైసీపీ రేపు చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పుంగనూరు దాడి ఘటన వెనుక ఉంది చంద్రబాబే అని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన పేరుతో 200 మంది రౌడీ మూకలను తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని రణరంగంగా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి చేసి వైసీపీనే దాడి చేయించినట్లు నమ్మబలికే ప్రయత్నం చేశారన్నారు. కాగా ఈ దాడిలో టీడీపీ-వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు రాయలసీమను నెత్తిటిసీమగా మార్చాలని చూశారన్నారు. ప్రాజెక్టులను చూసేందుకు వెళ్లిన ఆయన యుద్ధ వాతావరణం ఎందుకు సృష్టించారో అర్ధం కావడంలేదన్నారు. ఇలా గొడవలు పెట్టి ఎంతకాలం పబ్బం గడుపుతారని సజ్జల ప్రశ్నించారు. పుంగనూరు ప్రజలు టీడీపీకి ఓట్లు వెయలేదనే కోపంతో రౌడీలతో వెళ్లి వారిపై దాడి చేయించారని సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వైసీపీ నేతలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు హత్యా రాజకీయాల గురించి ప్రజలకు ఇప్పుడు అర్ధమైందన్న సజ్జల.. ఇక చంద్రబాబు జన్మలో అసెంబ్లీలో అడుగుపెట్టబోరని జోస్యం చెప్పారు.

మరోవైపు ఈ దాడిపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. చంద్రబాబు నాయడిపై దాడిని ఆయన ఖండించారు. రాష్ట్రంలో వైసీపీ రౌడీ రాజ్యం కొనసాగుతోందన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో జగన్‌ సంవత్సరాల కొద్ది ప్రజల్లో తిరిగారని గుర్తు చేశారు. తాము ఎప్పుడైనా దాడికి దిగామా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చన్నారు.

పుంగనూరులో జరిగిన ఇరువర్గాల దాడితో రాష్ట్రం అట్టుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష నాయకులు పోటాపోటీగా ధర్నాలు చేపట్టారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతను రాష్ట్రంలో తిరగకుండా చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. టీడీపీ రౌడీమూకలు ప్రశాంతంగా ఉన్న సీమనలో చిచ్చుపెట్టిందని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు పుంగనూరు ఘటనపై చిత్తూరు జిల్లా పోలీస్‌ యంత్రాంగం స్పందించింది. ఘటనపై విచారణ చేపడుతామని, ఘర్షణకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనకు ముందు జరిగిన పరిణామాలకు సంబంధించిన వీడియో తమకు అందిందన్నా ఎస్పీ.. చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు