Ramulu Nayak: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీని నేతల రాజీనామాలు వెంటాడుతున్నాయి. తాజాగా వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం కేసీఆర్‌కు పంపించారు. కాగా ఆయన రేపు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల నుంచే అలక..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకే ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న రాములు నాయక్ కు ఎదురుదెబ్బ తగిలింది. తనకు కాకుండా బానోతు మదన్ లాల్ కు కేసీఆర్ టికెట్ కేటాయించారు. కాగా తనకు కాకుండా వేరే అతనికి టికెట్ కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్న రాములు నాయక్ ఆరోజు నుంచే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వైరాలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడానికి రాములు నాయక్ కూడా ఒక కారణం అని అక్కడ టాక్ కూడా నడిచింది. పార్టీ అసంతృప్తిగా ఉన్న రాములు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాషాయ సైన్యంలో సైనికుడు అయ్యేందుకు బీజేపీలో ఆయన చేరనున్నట్లు తెలుస్తోంది.
SI నుంచి ఎమ్మెల్యే...
రాములునాయక్ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా రిటైర్డ్ అయినా తరువాత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించాడు, కానీ ఆ ఎన్నికల్లో మహాకూటమి ఒప్పందంలో భాగంగా వైరా నియోజకవర్గాన్ని సీపీఐ కి కేటాయించడంతో నిరాశ చెందాడు. ఆయన తరువాత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. రాములునాయక్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన మరోసారి పొత్తుల్లో భాగంగా సీపీఐ కే కేటాయించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బానోతు మదన్ లాల్ పై 2,013 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. లావుడ్య రాములు నాయక్ 15 డిసెంబర్ 2018లో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.