Andhra Pradesh: దూకుడు పెంచుతున్న పురందేశ్వరి.. కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దూకుడు పెంచుతున్నారు. ఆమె అధ్యక్షురాలు అయినప్పటి నుంచి తనదైన శైలిలో వైసీపీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఆమె టీడీపీ మైలేజ్ పెంచడం కోసమే ఇలా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి పురందేశ్వరి చూపిస్తున్న దూకుడు.. సొంత పార్టీ కోసమా లేక టీడీపీ కోసమా అనేది చర్చనీయాంశంగా మారింది.

New Update
Purandeswari: పురంధేశ్వరి నివాసానికి కూటమి నేతలు

ఆంధ్రప్రదేశ్‎లో ఎన్నికల సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీలు తమ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద విమర్శలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓవైపు చంద్రబాబు అరెస్టు అవ్వడం, టీడీపీ జనసేన పొత్తు ఖరారు కావడంతో రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం అటు టీడీపీ జనసేన కంటే.. ఎక్కువ స్థాయిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. ఆమె అధ్యక్షురాలు అయినప్పటి నుంచి తనదైన శైలిలో వైసీపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నటి వరకు వైసీపీ అనుకూలం అనే ముద్ర వేసుకున్న ఏపీ బీజేపీ.. ఆ ముద్రను చెరిపేసుకోవాలనే తాపత్రయంతో పురందేశ్వరి ఇలా వ్యవహరిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే టార్గెట్ వైసీపీగా పురందేశ్వరి వ్యవహార శైలి,ఆ పార్టీ కార్యక్రమాలు ఉంటున్నాయి.

2019 ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన కంటే ముందే.. బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఇసుక రవాణా లేకపోవడం, భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉండడంపై అన్ని పార్టీలకంటే ముందే రోడ్డుపైకి వచ్చింది ఆ పార్టీ. సోము వీర్రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అనేక కార్యక్రమాలు చేశారు. కరోనా సమయంలో కూడా రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో విగ్రహాల దొంగలింపు లాంటి అనేక అంశాలపై వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుబడింది. సోము వీర్రాజు వైసీపీపై తనదైన శైలిలో మాటల దాడి చేసేవారు. అయితే మిగతా పార్టీల కంటే ముందే అధికార పార్టీపై మాటల దాడి ప్రారంభించినప్పటికీ... ఆ పార్టీకి ఏపీలో ఏమాత్రం బలం పెరగలేదు. అంతేకాదు ఏపీలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. జగన్ మనిషి అని ఒక ప్రచారం కూడా అప్పట్లో నడిచింది. బీజేపీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శలు చేసి.. కేంద్రంలో జతకట్టిందనే ఆరోపణలను ఆ పార్టీ ఎదుర్కొంది. కానీ ఎప్పుడైతే పురందేశ్వరి రాష్ట్ర పార్టీ బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుండి.. సీన్ రివర్సయిందనే మాటలు అ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఏపీలోని అధికార పార్టీ పై ఘాటైన అయిన విమర్శలు చేయడం, వివిధ సమస్యల మీద పోరాటం చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మద్యం వ్యవహారంలో వైసీపీని ఇబ్బంది పెట్టేలా పురందేశ్వరి వ్యవహరిస్తున్నారు.

మద్యం కారణంగా అనారోగ్యానికి గురైన బాధితులను పరామర్శించడం దగ్గర నుండి, మద్యం షాపులకు వెళ్లడం, అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించడం.. మద్యం తయారీ కంపెనీలను వైసీపీ నేతలు బెదిరించి లాక్కున్నారనే వరకు ఆమె చూపిస్తున్న దూకుడు... అధికార పార్టీని ఇబ్బంది పెట్టేలాగా ఉందనేది అందరూ చెబుతున్న మాట. మద్యం వ్యవహారంలో పురందేశ్వరి ఆధారాలతో సహా మీడియా ముందుకు రావడంతో.. దాని తిప్పి కొట్టే ప్రయత్నం వైసీపీ చేయలేకపోయింది. మద్యం తయారీ కంపెనీల నిర్వహిస్తున్న వారి పేర్లను బయటపెట్టాలని సవాల్ విసిరినా....వైసీపీలో ఒక్కరు కూడా ఆ సవాల్ ని స్వీకరించలేకపోయారు. దీంతో వైసీపీ పైన పురందేశ్వరి పై చేయి సాధించారనే చర్చ కూడా నడిచింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. పురందేశ్వరి చూపిస్తున్న దూకుడు సొంత పార్టీ మైలేజ్ కోసం కాదని... తెలుగుదేశం పార్టీ మైలేజ్‎ని పెంచడానికి అంటూ వైసీపీ ఎదురుదాడి దిగుతోంది. పురందేశ్వరి ఏం చేసినా.. అది టీడీపీ కోసమేనని విమర్శలు వైసీపీ చేస్తోంది. మద్యం తయారీ కంపెనీలు, మద్యం అమ్మకాల గురించి పురందేశ్వరి మాట్లాడుతున్న స్క్రిప్ట్ అంతా టీడీపీ నుంచి వెళ్తోందనే ఆరోపణలు వైసీపీ నుంచి వస్తున్నాయి. వైసీపీ నేతల ఆరోపణలు నిజం చేసేలా అమిత్ షా తో లోకేష్ మీటింగ్ వ్యవహారంలో.. పురందేశ్వరి ఉండడం, లోకేష్ పక్కనే కూర్చోవడం వంటి అంశాలు వైసీపీ చేస్తున్న ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

Also Read: మీకు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి: నారా లోకేష్

అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ని హైలెట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ, బీజేపీని కలపాలనే ప్రయత్నం పురందేశ్వరి చేస్తే.. జాతీయ అధినాయకత్వం ఊరుకుంటుందా? ఏపీలో పురందేశ్వరి చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల వ్యవహారం పార్టీ అధినాయకత్వానికి తెలియకుండా జరుగుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కేంద్ర పార్టీ డైరెక్షన్లోనే పురందేశ్వరి ఏపీలో దూకుడు ప్రదర్శిస్తున్నారని, వాళ్లకు చెప్పే పురందేశ్వరి అంతా చేస్తున్నారని ఇంకో ప్రచారం నడుస్తోంది. పొత్తుల అంశాల గురించి అయినా.. భారతీయ జనతా పార్టీని ఏపీలో బలోపేతం చేయాలన్న జాతీయ పార్టీ సూచనలకు అనుగూణంగానే జరుగుతాయనేది పార్టీలోని కొంతమంది నేతలు చెబుతున్న మాట. ఏది ఏమైనా పురందేశ్వరి చూపిస్తున్న దూకుడు... ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని మాత్రం చెప్పుకోవచ్చు.. ఆ దూకుడు టీడీపీ లేక బీజేపీ కోసమా అనేది రాబోయే రోజుల్లో తేలే అవకాశముంది.

Advertisment
తాజా కథనాలు