Wayanad Landslides : కేరళ (Kerala) లో భారీ వర్షాలకు (Heavy Rains) కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 300 కు చేరింది. మండక్కై, చూరాల్‌మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించారు.
తీవ్రంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వరసగా మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదలో కూరుకుపోయిన బాధితులను గుర్తించేందుకు ఆర్మీ అధికారులు జాగిలాలతో అన్వేషిస్తున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 300 మందికి పైగా మృతిచెందారని NDRF డీఐజీ మొహసేన్ షాహిదీ ప్రకటించారు.
234 మంది గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇంకా సుమారు 200 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో బయటపడిన కొందరు ప్రజలు సోమవారం అర్ధరాత్రి జరిగిన భయానక అనుభవాన్ని పంచుకున్నారు.
అర్థరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని బాధితులు తెలిపారు. కిటికీలోంచి చూడగా పెద్ద ఎత్తున నీరు తమ ఇళ్ల వైపు రావడం కనిపించిందని చెప్పారు. ప్రాణాలు కాపాడుకునేందుకు డాబాలపైకి వెళ్లామనీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు గానీ మరొకరిని కాపాడేందుకు గానీ వీలు లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. సెల్‌ఫోన్లను వదిలి ఇళ్లపై కప్పుల పైకి వెళ్లడం వల్ల ఎవరికీ సమాచారం అందించలేకపోయినట్లు తెలిపారు.
Aslo read: తెలంగాణలో రాబోయే రెండు రోజులు వానలే..వానలు!