మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా.. సిగ్గుతో తలదించుకోండి: చెన్నై అధికారులపై విశాల్ ఫైర్

మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నైలో నెలకొన్న పరిస్థితులపై నటుడు విశాల్ స్పందించారు. చెన్నై మేయర్, కార్పొరేషన్ కమిషనర్, అధికారులంతా మీ కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా ఉన్నారా? నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. కనీసం మీ బాధ్యతనైనా నిర్వర్తించి ప్రజలను కాపాడండి అంటూ చురకలంటిచారు.

మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా.. సిగ్గుతో తలదించుకోండి: చెన్నై అధికారులపై విశాల్ ఫైర్
New Update

మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ కారణంగా చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. సోమవారం నగరంలో కురిసిన భారీ వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైకి వరదనీరు రావటంతో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. భీకర గాలులు, కుండపోత వానతో పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీటమునిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు, ఆహారం, నీరు లేక ముప్పు తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తమిళ స్టార్ నటుడు విశాల్ నాయకులు, అధికారులపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహానికి లోనయ్యారు. 2015లో వచ్చిన వర్షానికే నగరం పూర్తిగా స్తంభించిపోయిందని గుర్తు చేస్తూ.. ఇన్నేళ్లు గడిచినా నగరంలో ఎలాంటి మార్పులు జరగలేదని, చెన్నై మున్సిపల్ అధికారుల తీరు చూస్తూ సిగ్గేస్తుందంటూ చురకలంటించారు.

Also read:కాంగ్రెస్ పాలనలో మీకు దక్కేవి ఇవే..నటి మాధవీలత వైరల్ పోస్ట్

‘చెన్నై మేయర్ డియర్ ప్రియా రాజన్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్, మిగతా అధికారులంతా మీ కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నా. ముఖ్యంగా వర్షం కారణంగా పారే డ్రైనేజీ నీరు మీ ఇళ్లలోకి రావనుకుంటున్నా. మీ ఇళ్లకు ఎలాంటి లోటూ లేకుండా కరెంట్, ఆహారం, మంచి నీరు అందుతోందని తెలుసు. అయితే, ఇదే నగరంలో మీతోపాటు నివసిస్తున్న మేమంతా మీలా సురక్షితంగా లేం. మీరు చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రెయిన్ ప్రాజెక్ట్ సింగపూర్ కోసమా? లేక చెన్నై కోసం ఉద్దేశించిందా?' అని ప్రశ్నించారు. అలాగే 2015లో ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. వారికి మేం సాయం అందించాం. ఆ ఘటన జరిగి 8 ఏళ్లు గడిచిపోయింది. అయినా నగర పరిస్థితి మారకపోగా అంతకు మించి అధ్వానమైన పరిస్థితిని చూడటం దయనీయంగా ఉంది. ఈ సారి కూడా బాధితులకు మేమంతా ఆహారం, నీటిని సరఫరా చేసి వారిని ఆదుకుంటాం. అదేవిధంగా ప్రజా ప్రతినిధులందరూ వారివారి నియోజకవర్గాల్లో బయటకు వచ్చి బాధితులకు అండగా నిలుస్తారని నేను భావిస్తున్నా. ప్రజల్లో భయం, ఆందోళనను కాకుండా విశ్వాసాన్ని నింపాలని కోరుకుంటున్నా. వారికి సాయం చేస్తారని ఆశిస్తున్నా. ఇలా రాయాల్సి వస్తున్నందుకు నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. మీరేమీ అద్భుతాలు సృష్టిస్తారని ఆశపడటం లేదు. కనీసం మీ బాధ్యతను నిర్వర్తిస్తే చాలు’ అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా నెటిజన్లనుంచి విశాల్ కు పెద్ద ఎత్తున్న మద్ధతు లభిస్తోంది. రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

#chennai #cyclone-michaung #cyclone-michaung-updates #vishal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe