/rtv/media/media_files/2025/05/04/ihLLXbTRD04DvMy11rmJ.jpg)
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను చుట్టేస్తూ ట్రావెల్ వీడియోలతో తెలుగు ప్రేక్షకుల్లో విశేష గుర్తింపు పొందిన యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 1.3 మిలియన్ల (13 లక్షలు) ఫాలోవర్లు ఉన్న ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆ సంస్థ యాజమాన్యం శాశ్వతంగా తొలగించింది. ప్రస్తుతం సెర్చ్ రిజల్ట్స్‌లో కూడా ఈ అకౌంట్ కనిపించడం లేదు. అయితే, దీని వెనుక హైదరాబాద్ CCS పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో అన్వేష్ తన వీడియోలలో భారతదేశాన్ని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశాన్ని తక్కువ చేసి మాట్లాడారని, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన ప్రవర్తన ఉందని ఆరోపిస్తూ నటి కరాటే కళ్యాణి గతంలో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, ప్రాథమికంగా ఆయన పోస్ట్‌లు దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నట్లు గుర్తించారు.
పోలీసుల లేఖతో రంగంలోకి ఇన్‌స్టాగ్రామ్
కేసు దర్యాప్తులో భాగంగా సిసిఎస్ పోలీసులు తొలుత ఇన్‌స్టాగ్రామ్ సంస్థకు లేఖ రాసి అన్వేష్ అకౌంట్ వివరాలను సేకరించారు. ఆ వివరాలను విశ్లేషించిన అనంతరం, ఆ అకౌంట్‌తో ఇన్‌స్టా రూల్స్ ఉల్లంఘన జరుగుతోందని పోలీసులు నిర్ధారించారు. వెంటనే ఆ అకౌంట్‌ను తొలగించాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులకు మరో అధికారిక లేఖ రాశారు.
పోలీసుల నుండి స్పష్టమైన ఆధారాలతో కూడిన లేఖ అందడంతో, ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం ‘నా అన్వేషణ’ అకౌంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. తమ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను అతిక్రమించినట్లు నిర్ధారించుకుని, తక్షణమే ఆ ఖాతాను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అధికారుల వార్నింగ్
సోషల్ మీడియా వేదికగా దేశ గౌరవానికి భంగం కలిగించినా లేదా మతవిద్వేషాలను ప్రోత్సహించినా ఉపేక్షించేది లేదని ఈ ఘటన ద్వారా పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఎంతటి పాపులారిటీ ఉన్న వారైనా సరే, చట్ట పరిధి దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న తన అకౌంట్ ఒక్కసారిగా కనుమరుగు కావడంతో అన్వేష్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ పరిణామంపై అన్వేష్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Follow Us