తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి బతుకమ్మ పండుగ ఒక ప్రతీక. రాష్ట్ర ప్రజలు ఘనంగా ఈ బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసులు కూడా గౌరమ్మను పూజిస్తారు. అయితే పితృ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై.. సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుగుతాయి. తొమ్మిది రోజులలో రకరకాల నైవేద్యాలను గౌరమ్మకి పెడుతూ.. బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రజలు జరుపుకుంటారు.
ఇది కూడా చూడండి: Cricket: అమ్మాయిలు అదిరిపోయే ఆరంభం ఇస్తారా..
ముద్దపప్పు నైవేద్యంగా..
మహాలయ అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మ, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిధి నాడు అటుకుల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. ఇక బతుకమ్మ వేడుకల్లో మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను జరుపుకోనున్నారు. ఈరోజు ఎక్కువగా చిన్నపిల్లలు బతుకమ్మను జరుపుకోనున్నారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా పిలిస్తూ గౌరమ్మను పూజిస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలను గౌరమ్మకి నైవేద్యంగా సమర్పించి ఆటపాటలతో వేడుకను జరుపుకుంటారు.
ఇది కూడా చూడండి: నేటి నుంచి మహిళల పొట్టి కప్.. ఇక అమ్మాయిల వంతే!
బతుకమ్మ సంబరాల్లో 9 రోజుల పాటు వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారు చేసి ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ బతుకమ్మ తయారీలో ముఖ్యంగా తంగేడు పూలు, కట్ల పూలు, గునుగు పూలు, బంతి, మల్లె, సంపెంగ, చామంతి, గులాబీ, సీత జడలు, రుద్రాక్షలు వంటి రకరకాల పూలతో బతుకమ్మని అందంగా తయారు చేస్తారు. ఇంటి ముందు బతుకమ్మను పెట్టి ఆడపడుచులు అందరూ ఆటపాటలతో తొమ్మిది రోజులు బతుకమ్మను పూజిస్తారు. చివరిగా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ రోజు నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.