/rtv/media/media_files/2025/10/17/rivaba-jadeja-2025-10-17-14-14-10.jpg)
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, జామ్‌నగర్ నార్త్ ఎమ్మెల్యే రివాబా జడేజా గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కొత్త కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా శుక్రవారం ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి కూడా ప్రమాణం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, సామాజిక-ప్రాంతీయ సమతుల్యతను సాధించడంతో పాటు పాలనలో కొత్త శక్తిని నింపే లక్ష్యంతో బీజేపీ అధిష్టానం ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. గురువారం నాడు ముఖ్యమంత్రి మినహా మొత్తం 16 మంది మంత్రులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేసి 26 మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు.
#WATCH | BJP MLA Rivaba Jadeja takes oath as Gujarat Cabinet minister in Gandhinagar pic.twitter.com/mJzv53J2C0
— ANI (@ANI) October 17, 2025
2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబా జడేజా జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి, 61,065 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె, 2019లో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అంతకుముందు కర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్‌గా కూడా పనిచేశారు. ఒక ప్రముఖ అంతర్జాతీయ క్రికెటర్ భార్య రాష్ట్ర మంత్రివర్గంలో కీలక స్థానం పొందడం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కడం పట్ల ఆమె అనుచరులు, రవీంద్ర జడేజా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 15 మందితో సహా మొత్తం 26 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిలో రివాబా జడేజా కీలక పాత్ర పోషించనున్నారు.