దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా పల్లెల నుంచి మహానగరాల దాకా సందడి వాతావరణం నెలకొంది. అయితే వివిధ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో చేసిన ఓ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గొండాలో ఆడబిడ్డల ఆరాధన మహోత్సవం 'శక్తివందనం' నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో 11,888 మంది బాలికలకు పూజలు చేసి, కన్యా భోజనం ఏర్పాటు చేశారు. షాహీద్-ఎ-ఆజం సర్దార్ భగత్ సింగ్ ఇంటర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను నిర్వహించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ తెలిపారు.
Also Read: ఇద్దరి ఫొటోలు లీక్.. స్పందించిన శశిథరూర్
భారీ స్థాయిలో ఈ కన్యా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఘనమైన ఏర్పాట్లు చేసింది. 11 వేల 888 మందికి పైగా బాలికలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని రికార్డు సృష్టించారు. అంతేకాదు కన్యా పూజ వేడుకలో ‘జీరో వేస్ట్ ఈవెంట్’ ను కూడా నిర్వహించారు. అయితే ఈ భారీ కార్యక్రమంలో మొత్తం 138 కిలోల తడి చెత్త.. అలాగే 70 కిలోల పొడి చెత్త ఏర్పడింది. ఈ వ్యర్థాలను అక్కడికక్కడే పూర్తిగా తొలగించేలా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక తడి చెత్తను పారవేసేందుకు వేదిక వద్ద కంపోస్టు పిట్‌ను కూడా ఏర్పాటు చేశారు.