తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఉట్కూరులో ఓ భూవివాదం విషయంలో సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపన ఘటన సంచలనం రేపుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇలాంటి అరాచకాలు, హత్యలకు పాల్పడేవారిపై ఉపేక్షించేదని లేదని హెచ్చరించింది. దీనిపై నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉట్కూరు ఎస్సై బిజ్జ శ్రీనివాసులను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. అలాగే సంజీవ్‌పై దాడిచేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: కఠినంగా శిక్షించండి.. ఆరేళ్ల బాలిక అత్యాచార ఘటనపై సీఎం రేవంత్ సీరియస్!
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామానికి చెందిన సంజీవ్ అనే రైతు జీవనోపాధి కోసం కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఇటీవల వర్షాలు కురవడంతో తనకున్న నాలుగు ఎకరాలను సాగు చేసేందుక సొంతూరుకు వచ్చాడు. అయితే అప్పటికే అన్నదమ్ముళ్ల మధ్య భూ తగాదాలు ఉండటంతో.. గ్రామానికి సంజీవ్‌తో గొడవకి దిగారు. మాటామాట పెరగడంతో సంజీవ్‌పై దాయదీలు కర్రలతో దాడులు చేశారు. సంజీవ్ భార్య, గ్రామస్థులు ఎంతగా అడ్డుకున్నా కూడా విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ సంజీవ్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దాడి జరుగుతున్న సమయంలో కూడా పోలీసులకు సమాచారం అందించినా నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. డయల్ 100కు ఫోన్ చేశాక రెండు గంటల తర్వాత పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్సైపై వేటు పడింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.
Also Read: ముందుమాట వివాదం.. విద్యాశాఖ అధికారులపై బదిలీ వేటు!