US Cop : అమెరికా(America) లో 2020లో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి(Black Man) పై పోలీసులు చేసిన దురాగతానికి అతను మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. అయితే తాజాగా ఇప్పుడు మరో నల్లజాతీయుడిపై కూడా పోలీసులు అలాంటి దాష్టీకానికే పాల్పడ్డారు. మెడపై మోకాలితో గట్టిగా నొక్కిపెట్టారు. నాకు ఊపిరి ఆడటం లేదని ఆ బాధితుడు ఎంత మొత్తుకున్నా కూడా పోలీసులు తమ రాక్షసత్వాన్ని చూపించారు. చివరికి బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. వారం క్రితం ఓహియో రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన మరోసారి సంచలనం రేపుతోంది.
Also Read: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న : జో బైడెన్
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 18న ఓ కారు ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత కారులో ఉన్న ఫ్రాంక్ టైసన్(53) అనే ఓ నల్లజాతీయుడు సమీపంలో ఓ బార్‌లోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానం రావడంతో అక్కడికి వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం టైసన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి చేతులకు సంకేళ్లు వేసి కింద పడేశారు. పోలీస్ అధికారుల్లో ఒకరు టైసన్ మెడ వెనుక భాగంలో మోకాలు వేసి గట్టిగా నొక్కి పెట్టాడు. ఇప్పుడు బాగుందా అంటూ వికృతానందం పొందాడు. తనకు ఊపిరి ఆడటం లేదని బాధితుడు చెబుతున్నా కూడా ఆ పోలీసు అధికారి అలానే గట్టిగా నొక్కి పెట్టాడు. కొద్దిసేపటికి టైసన్‌లో చలనం లేకుండా పోయింది. ఆసుపత్రికి తరలించగా.. అతడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను కాంటన్ పోలీసులు(Canton Police) గురువారం విడుదల చేశారు. టైసన్ పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీసులను బ్యూ స్కోనెగ్జ్, కామ్డెన్ బుర్చ్‌గా గుర్తించారు.
2020లో కూడా ఆఫ్రో అమెరికన్ అయిన జార్జి ఫ్లాయిడ్ అనే వ్యక్తి మెడపై డేరేక్ చౌవిన్ అనే పోలీసు అధికారి దాదాపు తొమ్మిది నిమిషాలకు పైగా మెడ వెనుక మోకాలుతో గట్టిగా నొక్కి పట్టాడు. బాధితుడు నాకు ఊపిరి ఆడటం లేదని చెప్పినా కూడా ఆ పోలీస్ అధికారి పట్టించుకోలేదు. దీంతో జార్జీ ఫ్లాయిడ్ మరణించాడు. ఈ ఘటన తర్వాత అప్పట్లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే పేరుతో అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. ట్రంప్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటన జరగడం దుమారం రేపుతోంది.
Also read: ఎలక్ట్రికల్ కార్లకు చైనాలో 2000 డాలర్లు ధర తగ్గించేసిన టెస్లా!