Rajeev Chandrasekhar: అందుకే వాళ్లిద్దరు కలిసి నాపై కేసు పెట్టారు: రాజీవ్ చంద్రశేఖర్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ సీఎం పినరయి విజయన్‌ హమాస్‌పై బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని బహిర్గతం చేయడం వల్లే తనపై వాళ్లు కేసు పెట్టారని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు.

New Update
Rajeev Chandrasekhar: అందుకే వాళ్లిద్దరు కలిసి నాపై కేసు పెట్టారు:  రాజీవ్ చంద్రశేఖర్

ఇటీవల కేరళలో జరిగిన పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కొచ్చి సమీపంలోని కలమస్సేరీలోని జమ్రా అంతర్జాతీయ సమావేశ కేంద్రంలోని ప్రార్థనా మందిరంలో పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో 12 ఏళ్ల బాలికతో సహా ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. అలాగే 50 మంది క్షతగాత్రులయ్యారు. అక్కడికి వచ్చినవారు  ప్రార్థిస్తున్న సమయంలో రెండు ఎక్కువ తీవ్రతతో, ఒకటి స్వల్ప తీవ్రతతో కలిపి మొత్తం మూడు బాంబు పేలుళ్లు జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణలో తెలిసింది. అయితే ఈ ఘటనను ఉద్దేశించి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో వివిధ వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేశారనే ఆరోపణలతో కేరళ పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు.

Also read: అయోధ్య రామయ్యకి 8 అడుగుల బంగారు సింహాసనం

కేరళలో సంఘ విద్రోహ శక్తులు బలపడుతున్నాయని.. అయినాకూడా కేరళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. అయితే దీనిపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్.. రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యల్లో మతపరమైన అజెండా ఉందని.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సంస్థలపై గౌరవం ఉంచాలంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని.. కానీ కొంతమంది మాత్రం కొన్ని వర్గాలే లక్ష్యంగా బహిరంగ ప్రకటన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తనపై కేసు నమోదు కావడంతో రాజీవ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ సీఎం పినరయ్ విజయన్.. హమాస్‌పై బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని బహిర్గతం చేయడం వల్లే తనపై వాళ్లి్ద్దరు కలిసి కేసు పెట్టారని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో ఉన్న ఈ ఇద్దరు బుజ్జగింపుదారులు SDPI,PFI, హమాస్ లాంటి ఉగ్రసంస్థలపై సిగ్గులేకుండా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ నుంచి కేరళ వరకు వీళ్లు చేసిన రాజకీయాలు దశాబ్దాలకు పైగా తీవ్రవాదానికి కారణమయ్యాయని.. దీనివల్ల ఎంతోమంది అమయాకులు, భద్రత బలగాలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. అలాగే వారు చేస్తున్న బుజ్జగింపులను తాను బయటపెడితే కేసు పెడతామని బెదిరించారాని అన్నారు. అందుకే వీళ్లిద్దరూ కలిసి తనపై కేసు పెట్టారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు