Union Minister Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్(CM KCR) నేరస్తుడు అంటూ తెలంగాణ(Telangana) బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. కేంద్రం నుంచి ఇరిగేషన్ నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ ఎక్స్‌పర్ట్స్ బృందం వచ్చిందన్నారు. ప్రాజెక్టును పరిశీలించి సిద్ధం చేసిన రిపోర్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందిందని తెలిపారు. స్వయంగా రాష్ట్ర బీజేపీకి చెందిన ముఖ్య నేతలు కూడా ప్రాజెక్టును సందర్శించారని వివరించారు. ముఖ్యమంత్రి అవినీతి, నిర్లక్ష్యం వల్లే ప్రజాసొమ్ము దుర్వినియోగమైందని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి.
ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదన్నారు. రూ. లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రానున్న రోజుల్లో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామన్నారు. ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్‌ను ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు. ప్రాజెక్టు డిజైన్ చేసింది, పర్యవేక్షణ, కాంట్రాక్ట్, నిర్వహణ అంతా సీఎం కన్నుసన్నల్లోనే జరిగిందని, నేరం చేసి మౌనంగా ఉన్న ముఖ్యమంత్రిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కేసీఆర్ సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. తాము ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం లేదని, కేంద్ర దర్యాప్తు సంస్థలు దీనిపై విచారణ చేస్తాయని చెప్పారు కిషన్ రెడ్డి.
Also Read:
పొంగులేటి శ్రీనివాస్ ఆస్తి ఎంతో తెలుసా.. లెక్కలు చూస్తే కళ్లు తేలేస్తారు..!
నల్లగొండలో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల.. ఎవరి బలమెంతో తెలుసా?